Begin typing your search above and press return to search.

ఆంధ్రప్రదేశ్ మంత్రి గారి పదవి ఊడుతోంది

By:  Tupaki Desk   |   8 May 2019 7:26 AM GMT
ఆంధ్రప్రదేశ్ మంత్రి గారి పదవి ఊడుతోంది
X
ఎన్నికల ఫలితాలకు ఇంకో పక్షం రోజులే సమయం ఉంది. మే 23న రాబోయే ఫలితాల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి తిరస్కారం తప్పదన్న అంచనాలున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా ఆయన మంత్రివర్గమంతా రాజీనామా చేయక తప్పదని భావిస్తున్నారు. కానీ ఈ లోపే బాబు కేబినెట్లోని ఒక మంత్రి తన పదవిని వదులుకోవాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖమంత్రి మంత్రి కిడారి శ్రవణ్‌ రాజీనామా చేయనున్నట్లు సమాచారం. గత ఏడాది మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు దుర్మరణం పాలవడంతో ఆయన తనయుడైన కిడారి శ్రవణ్‌ ను మంత్రిని చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గత ఏడాది నవంబర్‌ 11న శ్రవణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఐతే మంత్రి అయ్యే వ్యక్తి.. ఆరు నెలల్లోపు శాసన సభ లేదా శాసన మండలికి సభ్యుడు కావాల్సి ఉంటుంది. లేదంటే పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 10వ తేదీతో ఆరు నెలల గడువు పూర్తి కానుండగా.. శ్రవణ్ ఇంకా ఎమ్మెల్యేగా కానీ.. ఎమ్మెల్సీగా కానీ ఎన్నిక కాలేదు. ఈ నేపథ్యంలో శ్రవణ్ చేత రాజీనామా చేయించాలని గవర్నర్‌ నరసింహన్‌ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. రాజ్‌ భవన్‌ అధికారులు మంగళవారం సాయంత్రం ఏపీ సర్కారుకు అధికారికంగా ఈ మేరకు సమాచారం అందించారు. ఈ విషయంపై కిడారి శ్రవణ్‌ బుధవారం ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలుస్తోంది. ఆయన సూచన మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రాజీనామా చేయడం తప్ప మరో అవకాశం లేని నేపథ్యంలో శుక్రవారం నాడు శ్రవణ్ తన రాజీనామా లేఖను సమర్పించే సూచనలు కనిపిస్తున్నాయి.