రాజావారి చేపల చెరువు: కిడ్నీ దొంగతనం
By: Tupaki Desk | 22 April 2015 4:31 AM GMTతన చెరువు ఎవరో దొంగలు ఎత్తుకెళ్లారంటూ రాజావారి చేపల చెరువు సినిమాలో పోసాని కృష్ణమురళి చేసే హడావుడి మనం మరిచిపోలేనిది. చెరువును ఎలా ఎత్తుకుపోతారంటూ ఆశ్యర్చపోయిన వారికి పోసాని క్యారెక్టర్ తగు రీతిలో జవాబు ఇస్తుంది. సమాజంలో అవినీతి ఏ విధంగా పాతుకుపోయిందో ఆ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. తాజాగా.. కిడ్నీదొంగతనం ఇదే రీతిలో జరిగింది. అవినీతితో కిడ్నీ దొంగతనం ఏంటి అనుకునేరు. ఈ కిడ్నీ అలా దొంగతనానికి గురికాలేదు. సదరు వ్యక్తికి తెలియకుండానే కిడ్నీని కొట్టేశారు!! మీరు చదివింది కరెక్టే. ఆయనకు తెలియకుండానే సదరు కిడ్నీని కొట్టేశారు.
తనకు తెలియకుండానే తన కిడ్నీని దొంగిలించారంటున్న ఈయన పేరు ఎన్.రాజవేలు. ఆయన కథనం ప్రకారం... తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తిరునల్లూరులో ఉన్న ఒక నూనెమిల్లు కర్మాగారంలో రాజవేలు కూలీగా పనిచేస్తున్నాడు. ఈ కర్మాగార యజమాని ప్రకాశంకు రెండు కిడ్నీలు చెడిపోయాయంట. సదరు యజమానిది ఓ పాజిటివ్ రక్తం. కిడ్నీ మార్పిడికి అదే కర్మాగారంలోని వందమంది కార్మికులకు రక్త పరీక్షలు నిర్వహించి 'ఓ పాజిటివ్' గ్రూపు ఉన్న రాజవేలును కిడ్నీ దానం చేయాలని కోరారు. రాజవేలు నో అనడంతో ఉట్టినే ఏం తీసుకోమని ఇందుకు రూ.20 లక్షలు ఇస్తామని ఆశ చూపారు. అయినప్పటికీ కిడ్నీ దానానికి రాజవేలు ససేమిరా అన్నాడు.
ఈ క్రమంలో గత నెల 9వ తేదీన రాజవేలుకు మత్తు మందు ఇచ్చి చెన్నైలోని ఒక ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజుల తరువాత రాజవేలు స్పృహలోకి రాగానే యజమాని తరఫు వ్యక్తులు అతని చేతిలో రూ.25 వేలు పెట్టారంట! వద్దని చెప్పడంతో రూ.లక్ష ఇస్తామన్నారు. అయినా నిరాకరించడంతో డబ్బులు బ్యాంకులో వేస్తామని, ఊరు వదిలి వెళ్లిపోవాలని.. లేదంటే ప్రాణాలతో ఉండవని బెదిరించారట. తన రేషన్ కార్డు, ఓటరు కార్డు స్వాధీనం చేసుకున్న యజమాని మనుషులు తనకు తెలియకుండా కిడ్నీని దొంగలించి ఆయనకు అమర్చారని, ఇప్పుడు తనను బెదిరిస్తున్నారని రాజవేలు పేర్కొన్నారు. ఈ విషయమై తనకు న్యాయం చేయాలని తిరుచ్చి జిల్లా కలెక్టర్ కేఎస్ పళనిస్వామికి బాధితుడు రాజవేలు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ సిఫార్సు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దొంగతనాల్లో ఇలా వింత దొంగతనాలు కూడా ఉంటాయి మరి !!