Begin typing your search above and press return to search.

కుర్ర ఎంపీకి చుక్క‌లే!... వైసీపీలోకి కిల్లి మేడ‌మ్‌!

By:  Tupaki Desk   |   28 Feb 2019 7:52 AM GMT
కుర్ర ఎంపీకి చుక్క‌లే!... వైసీపీలోకి కిల్లి మేడ‌మ్‌!
X
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న లండ‌న్ టూర్‌ ను ముగించుకుని తిరిగి వ‌చ్చిన త‌ర్వాత ఆ పార్టీలోకి వ‌ల‌స‌లు జోరందుకున్నాయి. మొన్న ఉద‌య‌మే లండ‌న్ నుంచి హైద‌రాబాద్ చేరుకున్న జ‌గ‌న్‌.. నిన్న ఉద‌యం న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని ప‌రిధిలోని తాడేప‌ల్లిలో కొత్త‌గా నిర్మించుకున్న ఇంటిలోకి గృహప్ర‌వేశం చేశారు. అదే స‌మ‌యంలో ఇంటికి అనుబంధంగానే నిర్మించుకున్న పార్టీ కార్యాల‌యాన్ని కూడా నిన్ననే జ‌గ‌న్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప‌ది రోజుల క్రితం దాకా కొన‌సాగిన వ‌ల‌స‌లు... నిన్న‌నే ఊపందుకున్నాయి. ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ తో పాటు ద‌గ్గుబాటి దంపతుల కుమారుడు హితేశ్ చెంచురామ్ కూడా నిన్న‌నే అధికారికంగా వైసీపీలో చేరిపోయారు. తాజాగా కాసేప‌టి క్రితం తాడేప‌ల్లికి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ నేత‌ - మాజీ ఎంపీ కిల్లి కృపారాణి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జ‌గ‌న్ స్వ‌యంగా కృపారాణికి పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

ఈ చేరికతో ఉత్త‌రాంధ్ర‌లో ప్ర‌త్యేకించి శ్రీ‌కాకుళం జిల్లాలో ఆయా పార్టీల బ‌లాబ‌లాలు మారిపోనున్నాయ‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. శ్రీ‌కాకుళం నుంచి గ‌తంలో ఎంపీగా విజ‌యం సాధించిన కృపారాణి... నియోజ‌క‌వ‌ర్గంపై త‌న‌దైన ముద్ర వేశారు. అంతేకాకుండా రాజ‌కీయాల‌కు కొత్త‌నే అయినా కూడా చిన్న వివాదానికి కూడా ఆస్కారం ఇవ్వ‌కుండా త‌న‌దైన శైలి క్లీన్ పొలిటీషియ‌న్‌ గా ఆమె రాణించారు. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ లేకుండా పోగా... త‌ర్జ‌న‌భ‌ర్జ‌నల అనంత‌రం ఆమె వైసీపీ వైపుప చూశారు. శ్రీ‌కాకుళం జిల్లాలో ప్ర‌త్యేకించి శ్రీ‌కాకుళం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో పార్టీని మరింత బ‌లోపేతం చేసే దిశ‌గా ఆలోచించిన జ‌గ‌న్‌... కిల్లి కృపారాణిని పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో శ్రీ‌కాకుళం నుంచి ఎంపీగా విజ‌యం సాధించిన టీడీపీ యువ‌నేత‌ - దివంగ‌త నేత ఎర్ర‌న్నాయుడి కుమారుడిగా కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడికి అన్నీ సానుకూల అంశాలే స్వాగ‌తం చెప్పాయి. అయితే ఇప్పుడు ప‌రిస్థితి మారిపోతుంద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. కిల్లి కృపారాణి లాంటి బ‌ల‌మైన నేత‌ను ఢీకొట్ట‌డం రామ్మోహ‌న్ నాయుడికి అంత ఈజీ ఏమీ కాద‌న్న వాద‌న వినిపిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంపై మంచి ప‌ట్టు - ప్ర‌జ‌ల్లో క్లీన్ ఇమేజీలు కిల్లికి సానుకూలాంశాలుగా నిలుస్తుండ‌గా - ఐదేళ్ల కాలంలో టీడీపీకి ఏర్ప‌డ్డ ప్ర‌తికూల‌త‌లు రామ్మోహ‌న్‌ కు ప్ర‌తిబంధ‌కంగా మారాయ‌న్న విశ్లేష‌ణ‌లు కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ ద‌ఫా గెలిచి నిలవాలంటే రామ్మోహ‌న్ నాయుడికి అంత ఈజీ ఏమీ కాద‌ని - కృపారాణి కాస్తంత క‌ష్ట‌ప‌డ్డా ఆమె గెలుపు సునాయ‌స‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది.