Begin typing your search above and press return to search.

వైసీపీలోకి సై అంటున్న కిల్లి కృపారాణి!

By:  Tupaki Desk   |   31 Aug 2017 11:03 AM GMT
వైసీపీలోకి సై అంటున్న కిల్లి కృపారాణి!
X
ఏపీ కాంగ్రెస్ పార్టీలో మిగిలి ఉన్న సీనియ‌ర్ నేత‌లు తాజా నంద్యాల ఫ‌లితంతో ఇక త‌ట్టా బుట్టా స‌ర్దుకోవ‌డ‌మే బెట‌ర్ అన్న‌ట్టుగా ఉన్నారు. రెండు ల‌క్ష‌ల పైచిలుకు ఓట‌ర్లు ఉన్న నంద్యాల‌లో క‌నీసం 2000 ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్య‌ర్థి ద‌క్కించుకోలేదు. పోనీ ఇక్క‌డ ప్ర‌చారం ఏమ‌న్నా త‌క్కువ‌గా చేశారా? మ‌న రాష్ట్ర‌లోని పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి స‌హా తెలంగాణ నుంచి ష‌బ్బీర్ అలీ కూడా వ‌చ్చి ప్ర‌చారం చేసినా.. నంద్యాల ఓట‌ర్లు కాంగ్రెస్‌ ను క‌నిక‌రించ‌లేదు. ఓట‌మ‌ని ముందే అంగీక‌రించిన ర‌ఘువీరా.. క‌నీసం గౌర‌వ ప్ర‌ద‌మైన ఓట్ల‌యినా సాధిస్తామ‌న్నారు.

కానీ, అది కూడా లేక‌పోవ‌డంతో ద‌శాబ్దాల చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ స్వ‌తంత్ర అభ్య‌ర్థిక‌న్నా దారుణంగా అవ‌మానాన్ని చ‌విచూసింది. దీంతో ఇక‌, ఈ పార్టీని బ‌తికించ‌డం అనేది క‌ల్లో మాట‌గా కాంగ్రెస్ సీనియ‌ర్లు నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు యాక్టివ్‌ గా ఉన్న‌, 2019 నాటికి అత్యంత బ‌లీయ శ‌క్తిగా ఎద‌గ‌నున్న జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీ గూటికి చేరాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఆమె జగన్ తో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలిసింది.

శ్రీకాకుళం జిల్లా టెక్క‌లికి చెందిన కృపారాణి వృత్తి రీత్యా డాక్ట‌ర్‌. స్థానికంగా ఆమెకు సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి కూడా ఉంది. అయినా కూడా రాజ‌కీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక‌, ఈ జిల్లాలో రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ బ‌లంగా ఉంది. కానీ ఇప్పుడు టీడీపీ బలం పుంజుకోవడంతో ధర్మాన వంటి నేతలు వైసీపీలోకి మారిపోయారు. అప్పటి నుంచి మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ - కిల్లి కృపారాణిలే జిల్లాలో కాంగ్రెస్‌ కి దిక్సూచిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరి వల్లే శ్రీకాకుళంలో ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

అయితే, 2019ని దృష్టిలో పెట్టుకుంటే కాంగ్రెస్‌ ను న‌మ్ముకుని ఎలాంటి ప్ర‌యోజ‌న‌మూ ఉండ‌ద‌ని భావిస్తున్నారు కృపారాణి. అందుకే ఆమె వైఎస్ కుటుంబంతో ధర్మానకు ఉన్న సాన్నిహిత్యం ద్వారా కృపారాణికి వైసీపీలో ప్రాధాన్యం దక్కేలా ఆయన మంతనాలు సాగిస్తున్నార‌ని స‌మాచారం. దీనికి జ‌గ‌న్ కూడా అంగీక‌రించార‌ని, ఇప్ప‌టికే ఓ ద‌ఫా చ‌ర్చ‌లు కూడా జ‌రిగిపోయాయ‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె టెక్క‌లి ఎంపీ సీటు త‌న‌కు కేటాయించాల‌ని కూడా జ‌గ‌న్‌ ను కోరిన‌ట్టు చెబుతున్నారు. మొత్తానికి ఈ సీటు విష‌యం ప‌క్క‌న‌పెడితే కృపారాణి.. కాంగ్రెస్‌ను వీడ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.