Begin typing your search above and press return to search.

వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి

By:  Tupaki Desk   |   24 July 2016 6:27 AM GMT
వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి
X
ఏపీలో బక్క చిక్కిపోయిన కాంగ్రెస్ కు మరో నేత గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో మంత్రిగా పనిచేసిన ఆ మహిళా నేత కాంగ్రెస్ నుంచి బయటపడడానికి ఎంతోకాలం పట్టకపోవచ్చని సమాచారం. వైసీపీ వైపు వడివడిగా అడుగులు వేస్తున్న ఆమె త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీలో ఆమె చేరికకు సంబంధించి చర్చలు పూర్తయ్యాయని.. ముహూర్తం నిర్ణయించడమే తరువాయని తెలుస్తోంది.

కేంద్ర మాజీ మంత్రి - కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని వినిపిస్తోంది. ఆమె పార్టీ మారుతారని కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే ఆమె కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం మానేశారు. అంతేకాదు.. తన విషయంలో వస్తున్న ఊహాగానాలను కూడా ఖండించడం లేదు.

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కృపారాణికి యూపీయే ప్రభుత్వంలో అనూహ్యంగా మంత్రి పదవి దక్కింది. అప్పటి రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్న ఆమె కుటుంబం మంత్రి పదవితో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరింత పట్టు బిగించింది. కానీ... రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ మట్టికొట్టుకుపోవడంతో కృపారాణి కూడా ఎంపీగా ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన శ్రీకాకుళానికి చెందిన మరో నేత ధర్మాన వైసీపీలో చేరినా కృపారాణి మాత్రం వైసీపీలో చేరలేదు. కృపారాణి కుటుంబానికి కాంగ్రెస్ నేత చిరంజీవితో దశాబ్దాలుగా మంచి స్నేహం ఉండడంతో వారు చిరంజీవి సూచనలూ పాటిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వారు వైసీపీలోకి వెళ్లాలని తొలుత అనుకున్నా కాంగ్రెస్ లోనే కొనసాగారు. అయితే... తాజాగా ధర్మాన మధ్యవర్తిత్వంతో వారు వైసీపీలోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే కృపారాణి వైసీపీలో చేరుతారని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో అంతరించిపోయే దశలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కృపారాణి కూడా గుడ్ బై చెబితే ఇక అంతే సంగతులు.