Begin typing your search above and press return to search.

ఐఫోన్స్ నుండి కండోమ్స్ .. కిమ్ ప్రపంచం వింతలకి నిలయం !

By:  Tupaki Desk   |   11 Jun 2021 11:30 PM GMT
ఐఫోన్స్ నుండి  కండోమ్స్ .. కిమ్ ప్రపంచం వింతలకి నిలయం !
X
ఉత్తరకొరియాలో వింతలే ఎక్కువగా చోటు చేసుకుంటాయి. లేదంటే ఉత్తరకొరియాలో జరిగినదే ఓ వింత అవుతుంది. ఎందుకంటే, ఇదంతా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కారణంగానే. సాధారణ దేశాధ్యక్షుల మాదిరిగా ఆయన వ్యవహారాలుండవు. తనదేశంలో తాను చెప్పిందే శాసనం అన్నట్లు ఉంటుంది. ఆధునిక నియంతగా కిమ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పుడప్పుడు కిమ్ జాంగ్ ఉన్ మరణించారంటూ వార్తలు కూడా వస్తుంటాయి. అయితే, ఆ తర్వాత కిమ్ జాంగ్ మీడియా ముందు కనిపిస్తుంటారు. అసలు ఇంతలా ప్రచారం జరగడానికి కారణం కిమ్ జాంగ్ వైఖరి తో పాటు ఆ దేశంలో ఉన్న నియమ నిబంధనలే కారణం. కఠిన చట్టాలను అమలు చేసే ఉత్తర కొరియాలో ప్రపంచంలో మరెక్కడా కనిపించని వింత వింత ఆంక్షలు కనిపిస్తుంటాయి. అందులో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం

1. పాశ్చాత్య ఫ్యాషన్ : ప్రపంచంలో ఎక్కడికెళ్లినా మినీ స్కర్టులు, జీన్స్ వంటి పాశ్చాత్య ఫ్యాషన్ మనకళ్లముందు కనిపిస్తుంది. కానీ ఉత్తర కొరియా వెళ్తే భూతద్దంతో వెతికినా అంత మోడ్రన్ ఫ్యాషన్ కనిపించదు. ఇక్కడ వేసుకునే దుస్తులను పరిశీలించడానికి ఫ్యాషన్ పోలీసులు కూడా ఉంటారు.

2. కోకా కోలా : ప్రపంచంలో అత్యధికులు తాగే కూల్‌డ్రింకులు కోకా కోలా కంపెనీవే. అయితే ఈ కంపెనీపై ఉత్తర కొరియాలో బ్యాన్ ఉంది. దీంతో ఇక్కడ కోక్ తాగడం అసాధ్యం.

3. హెయిర్ కట్: మనం హెయిర్ సెలూన్‌ కు వెళ్తే ఏ స్టైల్ లో అయినా హెయిర్ కట్ చేయించుకోవచ్చు. కానీ, నార్త్ కొరియాలో ఆ పప్పులు ఉడకవు. ఇక్కడ అబ్బాయిలకు 15 రకాలు, అమ్మాయిలకు 18 రకాల హెయిర్ స్టైల్స్‌ ను మాత్రమే కిమ్ జాంగ్ ఉన్ అనుమతించారు. అంతేకాదు, ఏ హెయిర్ స్టైల్ చేయించుకున్నా రంగు మాత్రం మార్చుకోకూడదు.

4. శానిటరీ ప్యాడ్స్ : అమ్మాయిలకు చాలా ముఖ్యమైన శానిటరీ ప్యాడ్లు, టాంపన్లపై కూడా నార్త్ కొరియాలో నిషేధం ఉంది. ఇక్కడి మహిళలు ఇప్పటికీ రీయూజబుల్ ప్యాడ్లనే ఉపయోగిస్తుంటారు.

5. కండోమ్స్: నార్త్ కొరియాలో బర్త్ కంట్రోల్‌ కు సంబంధించిన అన్ని విధానాలపై నిషేధం ఉంది. దీంతో ఇక్కడ కండోమ్స్ దొరకడం అసాధ్యం.

6. ప్రాపర్టీ : నార్త్ కొరియాలో భూమి, భవనాల హక్కులన్నీ ప్రభుత్వం వద్దే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇళ్లు కొనడం, అమ్మడం దాదాపు అసాధ్యం. అయితే కొందరు కొరియన్లు ఇలా చేయడానికి కొన్ని వక్ర మార్గాలు కనుగొన్నారు. దీంతో ఈ ఏడాదే ఈ విషయంలో కొన్ని చట్టాలను సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

7. డిజైనర్ షూస్ : ఉత్తర కొరియా వెళ్లి అక్కడ ఏవైనా బ్రాండెడ్ షూస్ కొనుక్కుందాం అనుకుంటే అయిపోయామే. ఇక్కడ ఎటువంటి డిజైనర్ షూస్ దొరకవు. వాటిపై కూడా బ్యాన్ ఉంది. అయితే చైనాతో సరిహద్దు పంచుకునే ప్రాంతాలకు వెళ్తే చైనాలో తయారైన షూస్ దొరికే అవకాశం ఉంది.

8. క్రిస్టమస్ ట్రీ : ఉత్తర కొరియా నాస్తిక వాద దేశం. అందుకే ఇక్కడ ఎటువంటి మత పరమైన చర్యలూ చేయడానికి వీల్లేదు. ఒక వేళ అనుమతి ఉన్నా చాలా భారీగా పర్యవేక్షణ ఉంటుంది. అంటే ఇక్కడ కనీసం క్రిస్టమస్ ట్రీలు, దేవుళ్ల ఫొటోలు, మతపరమైన పుస్తకాలు వంటివి కూడా దొరకవు.

9. స్టార్ బక్స్ కాఫీ : ప్రపంచంలో అత్యంత పాపులర్ కాఫీ స్టార్‌బక్స్. ఇది కూడా ఉత్తర కొరియాలో దొరకదు.

10. కేబుల్ టీవీ: ఉత్తర కొరియాలో కేవలం నాలుగే అధికారిక ఛానెల్స్ ఉంటాయి. అవి తప్పితే మిగతా టీవీ ఛానెల్స్ ఏవీ ఉండవు. ఇక్కడ ప్రభుత్వ సెన్సార్ షిప్ కూడా చాలా అధికంగా ఉంటుంది.

11. పాశ్చాత్య మ్యాగజైన్లు : విదేశీ మీడియాను ఉత్తర కొరియా నిషేధిస్తుంది. ప్రెస్‌ లో ఏమి ప్రింట్ చేయాలనే విషయాలను ప్రభుత్వం, స్పెషల్ ఏజెన్సీలు నిర్ణయిస్తాయి. ఉన్నవి కూడా రాజకీయాలు, విద్యకు సంబంధించినవే.

12. వైఫై, అంతర్జాతీయ కాల్స్: ప్రస్తుతం ప్రతి ఇంట్లో వైఫై ఉండాల్సిందే. ఇంటర్నెట్ లేకపోతే ప్రాణం పోయినట్లే ఉంటుంది. కానీ ఉత్తర కొరియాలో అది కుదరదు. ఇక్కడ వైఫై ఉండదు. దేశంలోని 15 మిలియన్ల (1.5 కోట్ల) జనాభాలో 1 మిలియన్ (10 లక్షలు) మంది వద్ద మొబైల్ ఫోన్ ఉంటుంది. అయితే వారు కూడా అంతర్జాతీయ ఫోన్ కాల్స్ చేసుకోవడానికి అనుమతులు ఉండవు.

13. మ్యూజిక్ కన్సార్ట్‌ల టికెట్లు : అతి కొద్ది మంది విదేశీయులకు మాత్రమే నార్త్ కొరియాలో మ్యూజిక్ కాన్సార్ట్‌ లు ఏర్పాటు చేసే అవకాశం దొరుకుతుంది. ఇప్పటి వరకూ స్లొవేనియాకు చెందిన లైబాష్ అనే బృందం మాత్రమే నార్త్ కొరియాలో ప్రోగ్రాం ఇచ్చింది.

14. యాపిల్ : ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది వాడే బ్రాండ్లలో యాపిల్ ఒకటి. ఈ టెక్ జెయింట్‌పై ఉత్తర కొరియాలో నిషేధం ఉంది. ఇదొక్కటే కాదు ఎటువంటి ఆధునిక హై-టెక్ వస్తువులూ అమ్మడానికి వీల్లేదని ప్రభుత్వ ఆల్టిమేటం. ఇక్కడ యాపిల్ ఐప్యాడ్ కొనుక్కోవడం అసాధ్యం. దీనికి బదులు నార్త్ కొరియా ప్రత్యేకంగా ఒక ట్యాబ్లెట్ పీసీ తయారు చేసింది. దాన్ని వాడుకోవడమే.

15. స్పోర్ట్స్ కార్లు: నార్త్ కొరియాలో అస్సలు లభించని మరో వస్తువు స్పోర్ట్స్ కార్లు. ఐక్యరాజ్య సమితి, యూరోపియన్ యూనియన్ విధించిన ఆంక్షల కారణంగా ఇక్కడ స్పోర్ట్స్ కార్లు కొనడం అసాధ్యం.