Begin typing your search above and press return to search.

కిమ్ సింగపూర్ సీక్రెట్స్.. చైనా హస్తం..

By:  Tupaki Desk   |   12 Jun 2018 10:02 AM GMT
కిమ్ సింగపూర్ సీక్రెట్స్.. చైనా హస్తం..
X
ఉత్తర కొరియా -అమెరికా అధినేతలు కిమ్ జాంగ్ ఉన్ - డొనాల్డ్ ట్రంప్ లు సింగపూర్ లో భేటి కావడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపింది. సింగపూర్ లోని ప్రఖ్యాత సెంతోసా అనే దీవిలోని స్టార్ రిసార్టులో ఈ భేటి సహృద్భావ వాతావరణంలో జరిగింది. ఒకప్పుడు బ్రిటీష్ సైనికుల ఫిరంగి దళం ఇక్కడ సైనిక అవసరాల కోసం ఈ దీవిని వినియోగించే వారు. స్వాతంత్యం అనంతరం సింగపూర్ ఈ దీవిని సుందరంగా మార్చి రిసార్టు పెట్టి పర్యాటక రంగంగా ఆహ్లాదకరంగా మార్చింది. అంటే ఒకప్పటి యుద్ధభూమి ఇప్పుడు శాంతి చర్చలకు వేదికకావడం విశేషంగా చెప్పవచ్చు.

కాగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సింగపూర్ కు అత్యంత కట్టుదిట్టంగా వచ్చారు. తన సొంత దేశం విమానాన్ని భద్రత పరమైన కారణాలతో తెచ్చుకోలేదు. చైనా దేశం ఈ ఉత్తర కొరియా అధ్యక్షుడి కోసం ఏకంగా బోయింగ్ 747 విమానాన్ని పంపింది. ఈ విమానాన్ని చైనా తమ మాజీ దేశాధ్యక్షుల కోసం వాడుతుంది. ఇప్పుడు కిమ్ కోసం ప్రత్యేకంగా పంపండంతో చైనా-ఉత్తరకొరియా సంబంధాల విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కిమ్ కోసం అతిపెద్ద విమానం పంపిన చైనా అందుకు ఎలాంటి చార్జీలు వసూలు చేయకపోవడం విశేషం. కిమ్ జాంగ్ ఉత్తరకొరియా అధ్యక్షుడిగా 2011లో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు సూదూర ప్రాంతంలో పర్యటించడం ఇదే తొలిసారి అట. అందుకే చైనా తన శాశ్వత మిత్రుడికి ఇలా విమానం పంపి సాయం చేసింది.

కిమ్ జాంగ్ కు భయాలు ఎక్కువ. ఉత్తరకొరియాలో ఎవరూ తనపై కుట్రలు చేసినా అందరినీ చంపేసిన చరిత్ర ఆయనది.. అలాంటి ఆయన ఇతర దేశాల్లో పర్యటిస్తూ ఆ మాత్రం జాగ్రత్త తీసుకోకుండా ఉంటాడా.? తీసుకున్నాడు మరీ.. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో శిఖరాగ్ర సమావేశానికి వచ్చిన కిమ్ తన వెంట ఓ మొబైల్ టాయ్ లెట్ కూడా తెచ్చుకున్నాడట. అది కిమ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించింది. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయి.

కిమ్ జాంగ్ తన ఆరోగ్య రహస్యాలను పశ్చిమ దేశాలు కనిపెట్టకుండా మొబైల్ టాయిలెట్ ను ఏకంగా ఉత్తరకొరియా నుంచి తెచ్చుకున్నాడట.. ‘కిమ్ కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. స్థూలకాయుడైన కిమ్ కు స్వతహాగా ఫాటీ లివర్ వ్యాధి ఉంది. మధుమేహం - అధిక రక్తపోటు - కీళ్లవాతం కూడా ఉన్నాయి. తన మల - మూత్రాలను పరీక్షించి పశ్చిమ దేశాలు తన ఆరోగ్య సమస్యను అంచనా వేస్తాయన్నది ఆయన భయం. అందుకే ఎటువంటి పరీక్షలకు లొంగని రీతిలో విసర్జన ను డిస్పోజ్ చేయగల అత్యాధునిక టాయ్ లెట్ ను తన కోసం ఆయన తయారు చేయించుకున్నాడని’ దక్షిణ కొరియా వార్త పత్రిక ఒకటి సంచలన కథనాన్ని ప్రచురించింది.