Begin typing your search above and press return to search.

జ‌పాన్ ప్ర‌జ‌ల్ని వ‌ణికిపోయేలా చేసిన కిమ్‌

By:  Tupaki Desk   |   29 Aug 2017 6:42 AM GMT
జ‌పాన్ ప్ర‌జ‌ల్ని వ‌ణికిపోయేలా చేసిన కిమ్‌
X
ఊహించ‌నిరీతిలో ఈ రోజు (మంగ‌ళ‌వారం) ఉద‌యం చోటు చేసుకున్న ఘ‌ట‌న‌కు జ‌పాన్ ప్ర‌జ‌లు వ‌ణికిపోయారు. జ‌పాన్ ప్ర‌భుత్వానికి షాక్ తినేలా చేసిన ఈ ఉదంతం ఇప్పుడు అంత‌ర్జాతీయంగా స‌రికొత్త సంచ‌ల‌నానికి కార‌ణ‌మైంది. ఉత్త‌ర‌కొరియా అధినేత క‌మ్ నియంత కిమ్ జాంగ్ త‌న వివాదాస్ప‌ద తీరుతో ఉద్రిక్త‌త‌ల‌కు తెర తీయ‌టం మామూలే. అమెరికాను.. త‌నకు ద‌గ్గ‌ర‌గా ఉండే జపాన్‌ను రెచ్చ‌గొట్టేలా క్షిప‌ణి ప్ర‌యోగాలు చేయ‌టం అల‌వాటే. అయితే.. గ‌తానికి భిన్నంగా ఈసారి అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ చేప‌ట్టిన క్షిప‌ణి ప్ర‌యోగం జ‌ప‌నీయుల‌కు షాకింగ్ గా మారింది.

తాను నిర్వ‌హించిన మూడు క్షిప‌ణి ప్ర‌యోగాలు ఫెయిల్ అయి 72గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే కిమ్ తాజాగా మ‌రోసారి జ‌పాన్‌ ను రెచ్చ‌గొట్టేలా ప్ర‌యోగానికి తెర తీశారు. ఆయ‌న నిర్వ‌హించిన తాజా ప్ర‌యోగంతో జపాన్ ప్ర‌భుత్వం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసేలా చేయ‌ట‌మే కాదు.. స‌గ‌టు జ‌ప‌నీయుడు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యేలా చేయ‌టం గ‌మ‌నార్హం. చివ‌ర‌కు జ‌ప‌నీయుల్ని అక్క‌డి ప్ర‌భుత్వం సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించే వ‌ర‌కూ వెళ్లింది.

త‌న‌కున్న ఆయుధ బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉత్త‌ర కొరియా నియంత కిమ్ త‌ర‌చూ క్షిప‌ణి ప‌రీక్ష‌ల్ని నిర్వ‌హిస్తూ ఉంటారు. ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌యోగించిన క్షిప‌ణుల‌న్నీ జ‌పాన్ భూభాగం మీదుగా ప్ర‌యాణించ‌లేదు. అవి కేవ‌లం స‌ముద్ర‌తీరంలోనే ప‌డేవి. ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌యోగించిన క్షిప‌ణ‌లు ప‌డేవ‌న్నీ జ‌పాన్ కు కాస్త దూరంగా ఉండేవి. తాజా ప్ర‌యోగం మాత్రం అందుకు భిన్నంగా సాగ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశంగా చెప్పాలి.

భార‌త కాల‌మానం ప్ర‌కారం ఈ రోజు తెల్ల‌వారుజామున (మ‌న కంటే జ‌పాన్ సుమారు మూడు గంట‌ల కంటే ముందు ఉంటుంది) అసాధార‌ణ రీతిలో ఉత్త‌ర‌కొరియా ప్ర‌యోగించిన క్షిప‌ణి జ‌పాన్ ద్వీపం ఉత్త‌ర భూభాగాన్ని దాటుకుంటూ అవ‌త‌ల ఉన్న ప‌సిఫిక్ మ‌హా స‌ముద్రంలో ప‌డింది. త‌మ‌వైపు దూసుకువ‌స్తున్న క్షిప‌ణిని గుర్తించిన జ‌పాన్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

రెండో ప్ర‌పంచ యుద్ధంగా హిరోషిమా.. నాగ‌సాకి చేదు అనుభ‌వాన్ని గుర్తు తెచ్చుకున్న జ‌ప‌నీయులు భ‌యాందోళ‌న‌ల‌తో వ‌ణికిపోయారు. త‌మ భూభాగం పైకి వ‌చ్చిన క్షిప‌ణిని జ‌పాన్ కూల్చేయ‌లేదు. దీంతో 700 మైళ్లు ప్రయాణించిన క్షిప‌ణి ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రంలో ప‌డింది. ఈ ఘ‌ట‌న అంత‌ర్జాతీయంగా పెను సంచ‌ల‌నంగా మారింది. దీనిపై జ‌పాన్ ప్ర‌భుత్వం ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.