Begin typing your search above and press return to search.

కిమ్ అదృశ్యం... శత్రువుల గుర్తింపునకు మాస్టర్ ప్లానంట

By:  Tupaki Desk   |   8 May 2020 2:30 AM GMT
కిమ్ అదృశ్యం... శత్రువుల గుర్తింపునకు మాస్టర్ ప్లానంట
X
ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనించే ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ నిజంగానే మామూలోడు కాదని చెప్పాలి. ఎందుకంటే... ఆయన వ్యూహాలన్నీ కూడా సాదారణంగా ఉండవు. ఏది చేసినా... తనదైన శైలిలో ఓ ప్రత్యేక రీతిలతో చేసే కిమ్.. నిజంగానే ప్రపంచ దేశాలన్నీ తనవైపే చూసేలా చేసుకుంటారు. తాజాగా కిమ్ మరణించారంటూ పెద్ద ఎత్తున రేగిన ప్రచారంలోనూ కిమ్ తనదైన మార్కును చూపించారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. దాదాపు 15 రోజుల పాటుగా కిమ్ మరణించారని, ఆయన వారసురాలిగా ఆయన సోదరికే అక్కడి అధికార పార్టీ సభ్యులు ఎంపిక చేశారని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను ఏమాత్రం పట్టించుకోకుండా.. మొన్న ఉన్నట్టుండి కిమ్ ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ మొత్తం వ్యూహం కిమ్ పన్నిన ఓ మాస్టర్ ప్లాన్ అని కూడా ఇప్పుడు అమితాసక్తి రేకెత్తించే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది.

స్కై న్యూస్ ఆస్ట్రేలియా వెలువరించిన ఈ వార్తా కథనం ప్రకారం.. కిమ్ చనిపోయాడంటూ రేగిన ప్రచారం మొత్తం కిమ్ రచించినదేనట. తన దేశంలో ఉంటూ తన కిందకే నీళ్లు తెచ్చేలా వ్యూహాలు పన్నుతున్న శత్రువులను గుర్తించేందుకు, అంతిమంగా వారి పని పట్టేందుకే కిమ్ ఈ వ్యూహాన్ని రచించారట. ఉత్తర కొరియాకు చెందిన ఇద్దరు ముఖ్యులు, గతంలో కిమ్ కు అత్యంత సన్నిహితంగానే మెలగి ఇప్పుడు దక్షిణ కొరియాలో ఉంటూ అక్కడి రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న వారే తనపై కుట్రకు ప్లాన్ వేశారని, ఈ క్రమంలో వారు ఎవరన్న విషయాన్ని గుర్తించేందుకే కిమ్ ఏకంగా తాను చనిపోయినట్లుగా వార్తలు సృష్టించి మరీ తనపై జరుగుతున్న కుట్రను కిమ్ బద్దలు కొట్టారని కూడా ఆ వార్తా కథనం చెబుతోంది. మొత్తంగా ఈ వార్త చూస్తుంటే... పూర్వంలో రాజులు తమపై జరిగే కుట్రను ఛేదించేందుకు అజ్ఝాతంలోకి వెళ్లిపోయి, శత్రువులను గుర్తించి తిరిగి రాజ్యంలోకి వచ్చేసి శత్రువుల పనిపట్టిన వైనం మనకు గుర్తుకు రాక మానదు. అచ్చు గుద్దినట్లుగా చందమామ కథ మాదిరే ఇప్పుడు కిమ్ వేసిన ప్లాన్ కూడా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. .అప్పుడెప్పుడో పూర్వకాలంలో రాజులే కాకుండా ఇటీవలి కాలంలో రష్యా నియంత జోసెఫ్ స్టాలిన్, జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్, ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ తదితరులు కూడా ఈ తరహాలోనే శత్రువులను మట్టికరిపించిన వైనం కూడా మనకు గుర్తుకు రాక మానదు. అంటే... నియంతలుగా మారిన పై ముగ్గురి మాదిరే.. ఆధునిక నియంతగా మారిన కిమ్ కూడా తనదైన శైలి వ్యూహాలు రచిస్తున్నారని చెప్పక తప్పదు. ఈ వ్యూహంలో ఒకప్పుడు కిమ్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటూ.. తనకే వెన్నుపోటు పొడిచి సౌత్ కొరియా పారిపోయిన ఉ.కొరియా మాజీ రాయబారి తాయ్ యాంగ్ హో, జీ షెయాంగ్ హోలే తనపై కుట్రకు పాల్పడినట్లుగా ఈ మిస్టరీ ప్లాన్ లో కిమ్ నిర్ధారించేశారట. ప్రస్తుతం వీరిద్దరూ సౌత్ కొరియా జాతీయ అసెంబ్లీ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కిమ్ గురించే వీళ్లు చెప్పే చిన్న విషయాలు కూడా సౌత్ కొరియా ప్రభుత్వం చాలా ప్రాధాన్యం ఇస్తుందట. ఇక కిమ్ చనిపోయాడని వీళ్లు ధృవీకరించేసి... సడన్‌గా కిమ్ తిరిగి రావడంతో ఖంగుతిన్నారట. మరి తనపైనే కుట్ర పన్నిన శత్రువులను కిమ్ ఏం చేస్తాడన్న విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది.