Begin typing your search above and press return to search.

అమెరికా ని వణికిస్తోన్న కిమ్ !

By:  Tupaki Desk   |   2 Jan 2020 9:48 AM GMT
అమెరికా ని వణికిస్తోన్న కిమ్ !
X
కిమ్‌ జోంగ్‌ ఉన్ ..ఈ పేరు కి ప్రపంచ వ్యాప్తం గా ఒక గుర్తింపు ఉంది. దూకుడు మ‌న‌స్త‌త్వం, వివాదాస్ప‌ద వైఖ‌రికి అసలైన చిరునామా ఈయన. ఉత్తర కొరియా అధ్యక్షుడి గా కిమ్‌ జోంగ్‌ ఉన్ ఎన్నో సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా మరోసారి మరో సంచ‌ల‌న ప‌రిణామంతో తెర‌మీద‌కు వ‌చ్చాడు. ఈసారి ఒకే సమయంలో ఇటు అమెరికా అటు ప్ర‌పంచం భ‌య‌కంపితులుగా మారే ప్ర‌క‌ట‌న చేశాడు. త్వరలో వ్యూహాత్మక ఆయుధాన్ని పరిచయం చేసి ప్రపంచాన్ని షాక్ కి గురిచేస్తామని కిమ్‌ సంచలన ప్రకటన చేశారు.

ఇటీవల జరిగిన వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ కొరియా కేంద్ర కమిటీ సమావేశంలో కిమ్‌ మాట్లాడుతూ ఈ విధమైన వ్యాఖ్యలు చేసినట్టు ఆ దేశ అధికార మీడియా కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. ఉత్త‌ర కొరియా అధికార మీడియా ప్ర‌కారం, ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక చర్చలను అమెరికా ఏకపక్షంగా నిలిపివేయడం పై కిమ్‌ మండి పడ్డారు. అణ్వాయుధాల తయారీ, ఖండాంతర క్షిపణుల పరీక్షలపై ఇన్నాళ్లూ తాము స్వీయనియంత్రణ పాటించామని, ఇకపై అలా ఉండదని చెప్పారు.

తాత్కాలికమైన ఆర్థిక ప్రయోజనాలకు తలొగ్గి దేశ భద్రతను తాకట్టు పెట్టబోమని కిమ్‌ తెలిపారు. తమ దేశంపై కుట్రలు, అణుదాడి హెచ్చరికలు పెరిగిపోతున్నాయని, ఈ నేపథ్యంలో వ్యూహాత్మక ఆయుధాన్ని రూపొందిస్తున్నట్టు చెప్పారు. తమ దేశ ప్రజలు ఇన్నాళ్లూ అనుభవించిన బాధలకు సమాధానంగా, ఇన్నాళ్లూ నిలిచి పోయిన అభివృద్ధి ని కొనసాగించేలా అనూహ్య చర్యలకు దిగుతామని హెచ్చరించారు. ఉత్తరకొరియాపై అమెరికా ఒత్తిడి కొనసాగుతున్నంత కాలం అణు నిరాయుధీకరణ జరిగే ప్రసక్తే లేదని, ఐక్యరాజ్యసమితి తన ఆంక్షలను ఉపసంహరించుకునేవరకు దేశ భద్రత కోసం వ్యూహాత్మక ఆయుధాల తయారీ కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ఉత్తర కొరియా వద్ద ప్రస్తుతం 50 అణ్వాయుధాలు ఉన్నట్టు అంచనా. శత్రు క్షిపణులను నిర్వీర్యం చేయగలిగే రక్షణ వ్యవస్థలు కూడా ఉన్నాయి. అమెరికాను చేరుకోగలిగే ఖండాంతర క్షిపణిని తయారు చేస్తున్నారు. సాధారణంగా అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే వ్యవస్థలను వ్యూహాత్మక ఆయుధాలుగా పిలుస్తుంటారు.