Begin typing your search above and press return to search.

కిమ్ ఊహించ‌ని నిర్ణ‌యం: ద‌క్షిణ కొరియాపై వెనుక‌డుగు

By:  Tupaki Desk   |   25 Jun 2020 5:30 PM GMT
కిమ్ ఊహించ‌ని నిర్ణ‌యం: ద‌క్షిణ కొరియాపై వెనుక‌డుగు
X
అణుబాంబులు.. దాడులు.. దేశంలో క‌ఠిన శిక్ష‌లు.. తాను చెప్పిందే వేదం వంటి వైఖ‌రితో ఉత్త‌ర కొరియావాసుల‌నే కాకుండా ప్ర‌పంచాన్ని మొత్తం భ‌యాందోళ‌న‌లో ప‌డేసే కిమ్ జోంగ్ వెనక‌డుగు వేశారు. అత‌డి వైఖ‌రిలో మార్పు వ‌చ్చి ఎప్పుడు శ‌త్రు దేశంగా చూసే ద‌క్షిణ కొరియాపై ఇప్పుడు సానుకూల నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ దేశంతో యుద్ధం వ‌ద్దు.. స‌న్నిహిత్యం కావాల‌ని మిత్ర వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఒక్క‌సారిగా అంత‌ర్జాతీయ విశ్లేష‌కులు షాక్‌కు గుర‌య్యారు. ఆయ‌న తీసుకున్న అనూహ్య నిర్ణ‌యం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మొన్న‌టి దాక పూర్తిస్థాయి యుద్ధానికి సంకేతంగా సరిహద్దు వెంట‌ భారీగా సైన్యాలను మోహరింపజేసిన కిమ్ వెనక్కి తగ్గి ఊహించ‌ని నిర్ణయం తీసుకున్నాడు..

ఉత్త‌ర కొరియా వైఖ‌రిపై ద‌క్షిణ కొరియా వినూత్న రీతిలో నిర‌స‌న‌లు తెలుపుతోంది. ఈ సంద‌ర్భంగా కరపత్రాల వివాదం ఏర్ప‌డింది. కిమ్ నియంతృత్వాన్ని ఖండిస్తూ, ప్రజలంతా ఆయనపై తిరగబడాలని ద‌క్షిణ కొరియావాసులు లక్షల కొద్దీ కరపత్రాలు రాస్తూ స‌రిహ‌ద్దు నుంచి ఉత్త‌ర‌కొరియాలో వేస్తున్నారు. గ్యాస్ బెలూన్ల ద్వారా ఈ కరపత్రాలను పంపుతున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన నియంత నేత సోదరి కిమ్ యో జాంగ్ ద‌క్షిణ‌ కొరియాపై సైనిక చర్యలకు ఆదేశించారు. ఈ క్ర‌మంలోనే రెండు దేశాల సరిహద్దుల్లోని అనుసంధాన కార్యాలయాన్ని పేల్చేసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా స‌రిహ‌ద్దులో సాయుధ బలగాలను మోహరించారు.

ఈ నేపథ్యంలో అధినేత కిమ్ ఇటీవ‌ల అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వరుస పరిణామాలపై చ‌ర్చించి ద‌క్షిణ‌ కొరియాపై సైనిక చర్యను నిలిపేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. యుద్ధం తప్పదనుకుంటున్న తరుణంలో ఎవరూ ఊహించని విధంగా కిమ్ వెనక్కి తగ్గడమే కాదు.. ద‌క్షిణ కొరియాతో సంబంధాలను పునరుద్ధరించుకునే దిశగానూ ఆదేశాలు జారీ చేశారు. ఈ విష‌యాన్ని ఉత్త‌ర కొరియా అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) బుధవారం కీలక ప్రకటనలు చేసింది.

సరిహద్దులో భారీగా మోహరించిన బలగాలు కిమ్ నిర్ణ‌యంతో వెనుదిరిగాయి. ద‌క్షిణ కొరియా నుంచి వచ్చే సందేశాలు వినపడకుండా స‌రిహ‌ద్దు అంతటా ఏర్పాటుచేసిన లౌడ్ స్పీకర్లను కూడా ఉత్తర కొరియా తొలగించింది. రెండు దేశాల మధ్య అనుసంధాన బిల్డింగ్‌ను పేల్చేయడంపై కిమ్ క్ష‌మించ‌ని కోరారు. ద‌క్షిణ కొరియాతో మునుపటి సంబంధాలనే కోరుతున్నట్లు సంకేతాలు పంపారు.