Begin typing your search above and press return to search.

బొత్సను మాజీని చేస్తాను అంటున్న కిమిడి వారి వారసుడు

By:  Tupaki Desk   |   1 Dec 2022 1:35 AM GMT
బొత్సను మాజీని చేస్తాను అంటున్న కిమిడి వారి వారసుడు
X
రాజకీయంగా విశేష అనుభవం కలిగిన నాయకుడు వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆయనది మూడున్నర పదుల రాజకీయ అనుభవం. ఆయన మంత్రిగా దశాబ్దన్నర కాలంగా కొనసాగుతున్నారు. అలాగే పీసీసీ చీఫ్ గా ఉమ్మడి ఏపీలో పనిచేశారు. సీఎం కావాల్సిన జాతకం కాస్తా తృటిలో తప్పిపోయింది. అయినా సరే రాజకీయం వాడి వేడి తెలిసిన వారు కాబట్టి జగన్ తో చేతులు కలిపి ఆయన మంత్రి వర్గంలో చోటు సంపాదించారు.

ఈ రోజుకీ విజయనగరం జిల్లా రాజకీయాలను ఆయన శాసిస్తున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం ఎంతలా ఉన్నా బొత్స ఒంటి చేత్తో జిల్లా రాజకీయాలను అనుకూలంగా చేసుకుని వైసీపీకి మొత్తం సీట్లు ఖాతాలో పడేలా చేశారు. ఎక్కడ ఏ క్యాండిడేట్ ని పెడితే నెగ్గుతారు అన్నది ఆయన అంచనా వేసి మరీ వారికే టికెట్లు ఇప్పించేలా చూశారు.

ఆయన పట్ల జగన్ కూడా గౌరవభావంగా ఉంటారు అని చెబుతారు. ఆయన సీనియారిటీని జగన్ కూడా గుర్తించి పెద్ద పీట వేస్తారు. ఇక 2024 ఎన్నికల్లో బొత్స పోటీ చేస్తారా లేక ఆయన తనయుడు బరిలోకి దిగుతారా చూడాలి. ఆయన చీపురుపల్లి నుంచి ఇప్పటికి నాలుగు ఎన్నికల్లో పోటీ చేస్తే మూడు ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన ప్రతీ సారి మంత్రిగానే కొనసాగారు.

అలాంటి చీపురుపల్లిలో బొత్సకు బలమైన ఇలాకాలో ఒక ప్రత్యర్ధి తొడగొట్టి మరీ సవాల్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బొత్సను ఓడించి తీరుతాను అని కూడా ఆయన గట్టిగానే సౌండ్ చేస్తున్నారు. ఆయన సీనియర్ నేత కాదు. బొత్స రాజకీయ అనుభవం లో పదవ వంతు ఆయనది. 2019 ఎన్నికల్లో ఫస్ట్ టైం ఆయన రాజకీయ అరంగేట్రం చేసి చీపురుపల్లి నుంచి టీడీపీ తరఫున బొత్సతో తలపడ్డారు. ఆయనే కిమిడి నాగార్జున.

ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు అయ్యారు. అయితే ఆయన్ని తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ ని చేసింది. ఆయన పార్టీని జిల్లాలో పటిష్టం చేయడంతో తన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఈసారి చీపురుపల్లిలో పాసుపుజెండా రెపరెపలు ఆడడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే వైసీపీ నుంచి చాలా మంది నాయకులను టీడీపీలోకి నాగార్జున చేర్చుకున్నారు.

ఆయన పల్లె నిద్రలు చేస్తున్నారు. నియోజకవర్గం అంతా కలియతిరుగుతున్నారు. బొత్స రాష్ట్ర మంత్రిగా ఉండడం వల్ల ఎక్కువ సమయం నియోజకవర్గానికి వెచ్చించలేకపోతున్నారు. దాంతో ఈ గ్యాప్ ని నాగార్జున బాగా వాడేసుకుంటున్నారు అని అంటున్నారు. ఇక ఆయన తల్లి కిమిడి మృణాళిని 2014లో ఇదే సీటు నుంచి గెలిచారు. చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. మరో వైపు చూస్తే కిమిడి కళా వెంకటరావు నాగార్జునకు పెదనాన్న అవుతారు. ఆ రాజకీయ బలం కూడా ఆయనకు కలసివస్తోంది.

విజయనగరం జిల్లాలో బలమైన తూర్పు కాపులు రాజకీయంగా ప్రభావం చూపిస్తారు. ఆ సామాజికవర్గానికి చెందిన నాగార్జున ఏకంగా బొత్స మీదనే కత్తులు దూస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో రాజకీయ కురు వృద్దుడైన బొత్సను నాగార్జున ఓడిస్తారా. ఆయన కోరుకున్నట్లుగా చీపురుపల్లి నుంచి టీడీపీ జెండా ఎగరేసి ఎమ్మెల్యే అవుతారా అంటే వేచి చూడాల్సిందే. ఎందుకంటే అక్కడ ఎవరు గెలుస్తారు అన్నది జనం ఇచ్చే తీర్పు బట్టి ఆధారపడి ఉంటుంది. మరి బొత్స వ్యూహాలు ఆయన ఎత్తుగడలు ఏమిటి అన్నది కూడా చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.