Begin typing your search above and press return to search.

ఆస్తి వివాదంలో మహిళలపై ఎర్ర మట్టి పోసేసిన వైసీపీ నాయకులు

By:  Tupaki Desk   |   8 Nov 2022 6:55 AM GMT
ఆస్తి వివాదంలో మహిళలపై ఎర్ర మట్టి పోసేసిన వైసీపీ నాయకులు
X
విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతం ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. అధికార పార్టీకి చెందిన నేతల తీరు ఇటీవల కాలంలో అభ్యతరకరంగా మారిందన్న మాట తరచూ వినిపిస్తున్న వేళ.. ఆ వాదనకు బలం చేకూరే ఉదంతం ఒకటి తెర మీదకు వచ్చింది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో ఒక అమానుష ఉదంతం చోటు చేసుకుంది. తమ కుటుంబానికి చెందిన మహిళలతో తమకున్న ఆస్తి వివాదంలో భాగంగా.. తాజాగా కుటుంబ సభ్యులు (వీరు వైసీపీ నేతలుగా చెబుతున్నారు) మహిళపై ఎర్ర మట్టి పోసేసి.. అందులో వారు ఇరుక్కుపోయేలా చేసిన ఉదంతం సంచలనంగా మారింది.

ఈ షాకింగ్ ఉదంతానికి సంబంధించి బాధితులు చెబుతున్న వివరాల్ని చూస్తే.. తమ కుటుంబానికి వచ్చిన ఆస్తుల్లో భాగం ఇవ్వాల్సి ఉందని హరిపురానికి చెందిన కొట్ర దాలమ్మ.. ఆమె కుమార్తె సావిత్రి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న ఉమ్మడి ఆస్తి అయిన ఇంటి స్థలంలో దాలమ్మ భర్త నారాయణ అన్న కొడుకు రామారావు కొద్ది రోజులుగా ట్రాక్టర్లతో కంకర మట్టి తోలిస్తున్నాడు. దాలమ్మ భర్త అనారోగ్యంతో మరణించారు. ఇందులో తమకు వాటా ఉందని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

మట్టి తోలనీయకుండా ట్రాక్టరర్ వెనుక వైపు వెళ్లి కింద కూర్చున్నారు. తమకు అడ్డు చెబుతున్న దాలమ్మ.. ఆమె కుమార్తెపై ఆగ్రహంతో ఉన్న దాలమ్మ భర్త అన్న కొడుకు వారి అభ్యంతరాల్ని పట్టించుకోకుండా.. వారిపై కంకర మట్టిని పోస్తూ ఆన్ లోడ్ చేశారు. దీంతో.. మట్టిలో కూరుకుపోయిన తల్లీకుమార్తెలు తమను కాపాడాలంటూ కేకలు వేశారు. దీంతో.. సమీపంలోని యువకులు స్పందించి.. వారిని ఎర్ర మట్టి నుంచి బయటకు తీశారు.

కుటుంబానికి చెందిన ఆస్తిలోతమకు న్యాయంగా దక్కాల్సిన వాటా అడుగుతుంటే.. కక్ష కట్టి తన భర్త అన్న కొడుకులు తమపై మట్టి కప్పించి హత్యాయత్నానికి పాల్పడినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతం సంచలనంగా మారింది. బాధితురాలి భర్త అన్న కొడుకులు వైసీపీ నేతలుగా స్థానికంగా పేరుండటంతో ఇది కాస్తా రాజకీయ అంశంగా మారింది.

ఈ ఆస్తి వివాదం 2019 నుంచి ఉందని చెబుతున్నారు. దాలమ్మ భర్త నారాయణ మరణించటంతో ఆమె.. ఆమె కుమార్తెలు.. ఉమ్మడి ఆస్తుల్లో వాటా కోరుతున్నారు. నారాయణ ఇద్దరు అన్నదమ్ములు తమకూ సమానంగా ఆస్తిలో వాటాను కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా గతంలో నిరాహార దీక్ష చేశారు.

అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న సీదిరి అప్పలరాజు కలుగజేసుకొని.. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వటంతో దీక్షను విరమించారు. తర్వాత పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దాలమ్మ భర్త అన్న కొడుకులకు గ్రామానికిచెందిన వైసీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని.. వారి బలాన్ని చూసుకొని తమపై వేధింపులకు దిగినట్లుగా ఆరోపిస్తున్నారు. ఈ వైఖరిని పలువురు తప్పుపడుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.