Begin typing your search above and press return to search.

డిస్కౌంట్ రేటుకి లిక్కర్ కింగ్ విల్లా కొనట్లేదు

By:  Tupaki Desk   |   6 Dec 2016 6:59 AM GMT
డిస్కౌంట్ రేటుకి లిక్కర్ కింగ్ విల్లా కొనట్లేదు
X
ప్రపంచంలో ఆఫర్ కు ఏదైనా వస్తువ అమ్ముతామని చెప్పాలే కానీ ఎగబడి కొనేస్తుంటారు. చాలా కంపెనీలు తమ ఉత్పత్తుల్ని ఆఫర్ల మీదే జనాలకు మరింత దగ్గరయ్యేలా చేస్తుంటాయి. అదేం ఖర్మో కానీ.. కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా వ్యవహారం మాత్రం దీనికి భిన్నం. ఆయనకు చెందిన విల్లాను కొనేందుకు జనాలు అస్సలు ఆసక్తి చూపించటం లేదు. విలాసాలకు ఏ మాత్రం కొదవ లేని ఈ పెద్దమనిషికి చెందిన విల్లాను వేలానికి పెడితే.. ఒక్కడు ముందుకు రాలేదు. బ్యాంకుల వద్ద భారీ ఎత్తున అప్పులు చేసి.. గ్రేట్ బ్రిటన్ కు చెక్కేసిన ఈ విలాసపురుషుడి దెబ్బకు బెంబేలెత్తి పోయిన బ్యాంకులు.. తమ వద్ద కుదవ పెట్టిన ఆస్తుల్ని అమ్మేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి.

మాల్యాకు చెందిన ఆస్తులంటే ఆదో క్రేజ్ అని చెప్పేదానికి భిన్నంగా ఇతగాడి ఆస్తులు కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపించకపోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేనా.. ప్రపంచంలో ఇంతమంది డబ్బున్న మారాజులు ఉన్నప్పటికీ ఆయన ఆస్తులు కొనేందుకు ఎందుకు ఇంట్రస్ట్ చూపించటం లేదన్న మాటను చూస్తే.. ఆకాశాన్ని తాకేలాధరలు పెట్టారన్న మాట వినిపించింది.

మాల్యాను నమ్మి అప్పులిచ్చిన బ్యాంకుల మీద కూడా ఈ మాటల ప్రభావం పడినట్లుంది. అందుకే వారు.. ఈ విల్లాను ఎలాగైనా అమ్మేసేందుకు డిస్కౌంట్ రేటుకు అమ్మకానికి పెట్టేశారు.సిత్రమైన ముచ్చటేమిటంటే.. డిస్కౌంట్ ధరకు పెట్టినా.. దీన్ని కొనేందుకు ఒక్కరంటే ఒక్కరూముందుకు రాని పరిస్థితి. దీంతో.. మరికాస్త తగ్గిన బ్యాంకులు మరో మారు తాము కోత పెట్టిన ధరకు ఇంకాస్త కోత పెట్టి అమ్మటానికి తాజాగా రెఢీ అయిపోయారు.

ఉత్తర గోవాలోని కండోలిమ్ వద్ద ఉన్న ఈ విల్లాకు రూ.81 కోట్లుగా ధర ఫిక్స్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇలా ధరలుతగ్గించినా అమ్ముడుపోని ఆస్తులు మాల్యాకు చెందినవి చాలానే ఉన్నాయట. వాటిల్లో కింగ్ ఫిషర్ కేంద్ర కార్యాలయం.. కింగ్ ఫిషర్ హౌస్.. కింగ్ ఫిషర్ విమానయాన సంస్థకు చెందినట్రేడ్ మార్కులు కూడా బ్యాంకులు వేలం వేశాయి. ఆశ్చర్యకరంగా వీటిల్లో ఏవీ అమ్ముడు కాకపోవటంతో.. ముందుగా నిర్ణయించిన ధరల్ని అంతకంతకూ తగ్గిస్తున్నాయి. అయినప్పటికీ.. కొనేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావటం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. మాల్యా ఆస్తుల్ని ఎవరూ ఎందుకు కొననట్లు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/