Begin typing your search above and press return to search.

నేను కింగ్ మేక‌ర్‌ ను కాదు..కింగ్‌ నే

By:  Tupaki Desk   |   30 April 2018 5:48 AM GMT
నేను కింగ్ మేక‌ర్‌ ను కాదు..కింగ్‌ నే
X
క‌ర్ణాట‌క ఎన్నిక‌లు ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్నాయి. ఓ వైపు పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టం మ‌రోవైపు హంగ్ వ‌స్తుంద‌నే విశ్లేష‌ణ‌లు మీడియా చేస్తుండ‌టం తెలిసిన సంగ‌తే. ఈ నేప‌థ్యంలో క‌న్న‌డ పోరులో కీల‌క‌మైన పార్టీ అయిన జనతాదళ్-ఎస్ (జేడీఎస్) కర్ణాటకశాఖ అధ్యక్షుడు హెచ్‌ డీ కుమారస్వామి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను కింగ్ మేకర్‌ ను కాదని, కింగ్‌ గా అవతరిస్తానని చెప్పారు. తనను కింగ్‌ గా ఉండాలని రాష్ట్ర ప్రజలు దీవించారని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వచ్చే నెల 12న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. 113 స్థానాల్లో గెలుపొందడమే తన లక్ష్యమని చెప్పారు.

ప్రస్తుత అంచనాల ప్రకారం 97-105 స్థానాల్లో జేడీఎస్ గెలుపొందుతుందని, మిగతా స్థానాల్లో విజయం కోసం కృషి చేస్తున్నామని కుమార‌స్వామి తెలిపారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి ఏడెనిమిది సీట్లు తగ్గవచ్చునని, కానీ దాన్ని కూడా అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ - బీజేపీల పనితీరును చూసిన ప్రజలు వాటి పట్ల విశ్వాసం కోల్పోయారని కుమార స్వామి అన్నారు. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న జేడీఎస్‌కు ఈ ఎన్నికలు తమ మనుగడకు పరీక్షగా నిలిచాయని కుమారస్వామి అంగీకరించారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశమే లేదని అన్నారు. చాపకింద నీరులా జేడీఎస్ పట్ల ప్రజల్లో అనుకూల వాతావరణం పెరుగుతున్నదని చెప్పారు. సిద్దరామయ్య తన గెలుపు కోసం బీజేపీతో అవగాహన కలిగి ఉన్నారని, 2013లో సిద్దరామయ్యపై పోటీకి దిగిన బీజేపీ అభ్యర్థి పోలింగ్‌ కు ఐదు రోజుల ముందు పరారవడానికి ఈ అంతర్గత అవగాహనే కారణమని కుమారస్వామి ఆరోపించారు.

ఇదిలాఉండ‌గా...కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌ వాదీ పార్టీ (ఎస్పీ) - బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఉత్తర్‌ ప్రదేశ్ ఉపఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేశాయి. ఇతర రాష్ర్టాల్లో ఎటువంటి అవగాహన కుదుర్చుకోలేదని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు. అయితే లౌకిక శక్తులు కలిసి పని చేయాలని తాము కోరుతున్నామన్నారు. జేడీఎస్‌ తో బీఎస్పీ కలిసి పోటీ చేస్తుండగా, ఆ పార్టీ అధినేత మాయావతి వచ్చేనెల 5 -6 తేదీల్లో బెలగావి - బీదర్‌ లో దేవెగౌడతో కలిసి ర్యాలీల్లో పాల్గొంటారు. ఎస్పీ అభ్యర్థుల తరఫున అఖిలేశ్ ప్రచార షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు.