Begin typing your search above and press return to search.

అచ్చెన్న‌.. గెలుపు అందించేనా?

By:  Tupaki Desk   |   15 Nov 2021 2:30 PM GMT
అచ్చెన్న‌.. గెలుపు అందించేనా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగు దేశం పార్టీ మ‌రో క‌ఠిన ప‌రీక్ష ఎదుర్కొంటోంది. వివిధ కార‌ణాల‌తో గ‌తంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌ని కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీలు, న‌గ‌ర పంచాయ‌తీల్లో ఈ రోజే పోలింగ్‌. 2024 ఎన్నిక‌ల్లో గెలిచి రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న మాజీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఈ ఎన్నిక‌లు ఎంతో కీల‌కం.

ఓ వైపు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను స్వ‌యంగా ఆయ‌నే ప‌ర్య‌వేక్షించ‌గా.. ఇక మ‌రో ప్ర‌ధాన మున్సిప‌ల్ కార్పోరేష‌న్ అయిన నెల్లూరులో ఆ బాధ్య‌త‌ల‌ను ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడుకు అప్ప‌గించారు. దీంతో ఈ ఎన్నిక‌లు అచ్చెన్న‌కు స‌వాలుగా మారాయి.

స‌వాలుకు నిలిచేనా?
కింజార‌పు అచ్చెన్నాయుడు తెలుగు దేశం పార్టీకి ఉత్త‌రాంధ్ర‌లో కీల‌క నాయ‌కుడు. గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచిన‌ప్ప‌టికీ టెక్క‌లి నుంచి ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచారు. వ‌రుస‌గా రెండోసారి.. మొత్తం మీద అయిదో సారి విజ‌యం సాధించారు. అందుకే ఏపీ టీడీపీ బాధ్య‌త‌ల‌ను బాబు ఆయ‌న‌పై పెట్టారు. అయితే కేసుల విష‌యం కావొచ్చు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కావొచ్చు అచ్చెన్నాయుడు మ‌ధ్య‌లో కొంత‌కాలం సైలెంట్ అయ్యారు. కానీ ఇటీవ‌ల మ‌ళ్లీ జోరు అందుకున్నారు. అధికార పార్టీ ప్రభుత్వంపై మాట‌ల దాడి పెంచారు.

దీంతో నెల్లూరు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించే బాధ్య‌త‌ను బాబు ఆయ‌న‌కు అప్ప‌జెప్పారు. టీడీపీ అధ్య‌క్షుడిగా ఎంపికైన త‌ర్వాత అచ్చెన్నాయుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద స‌వాలు ఇదే. కొన్ని రోజులుగా నెల్లూరులోనే తిష్ట‌వేసిన అత‌ను.. పార్టీ శ్రేణుల‌ను ఉత్సాహ ప‌రిచే ప్ర‌య‌త్నం చేశారు. టీడీపీ పార్టీ అభ్య‌ర్థుల‌కు ఓట్లు ప‌డేలా త‌న వంతు కృషి చేశారు. మ‌రి ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి.

వైసీపీ జోరు..
అధికార పార్టీ నుంచి ఎన్నిక‌ల బాధ్య‌త‌లు తీసుకున్న మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ దూకుడుగా ముందుకు సాగారు. వైసీపీకి విజ‌యం అందించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేశారు. 54 డివిజ‌న్లు ఉన్న ఆ కార్పొరేష‌న్‌లో ముందుగానే 8 డివిజ‌న్లు ఏక‌గ్రీవంగా వైసీపీ చేతికి వ‌చ్చేశాయి.

మిగిలిన వాటిని జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లోనూ అధికార పార్టీదే పైచేయి అని అనిల్ న‌మ్మ‌కంతో ఉన్నారు. నెల్లూరు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ వైసీపీకే ద‌క్కుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా చెప్తున్నారు. మ‌రి అచ్చెన్నాయుడి కృషి పార్టీకి ఏ మేర‌కు ఓట్లు రాబ‌డుతుందో చూడాలి.