Begin typing your search above and press return to search.

అచ్చే దిన్ అంటున్న అచ్చెన్న... మ్యాటరేంటి... ?

By:  Tupaki Desk   |   22 Nov 2021 2:30 AM GMT
అచ్చే దిన్ అంటున్న అచ్చెన్న... మ్యాటరేంటి... ?
X
టీడీపీ కి అచ్చే దిన్ అంటూ హుషార్ చేస్తున్నారు ఏపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడు. ఇదే నేత కొన్నాళ్ళ క్రితం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వేళ పార్టీ లేదూ ఏమీ లేదూ అంటూ హార్ష్ గా మాట్లాడారని వీడియోలు నెట్ లో ఒక లెక్కన తిరిగాయి. మరి కేవలం ఎనిమిది నెలల తేడాలో ఏపీలో టీడీపీకి అచ్చే దిన్ ఎలా వచ్చేను అంటే సీనియర్ మోస్ట్ లీడర్ అయిన అచ్చెన్నాయుడే దీనికి ధాటీగానే జవాబు చెబుతున్నారు.

ఏపీలో వైసీపీ పని అయిపోయింది. ఇక వారు కచ్చితంగా ఉండేది రెండున్నరేళ్లు మాత్రమే అంటున్నారు. ఈ విషయం తెలుసు కాబట్టే జగన్ కూడా ఫుల్ గా ఫస్ట్రేషన్ లో ఉన్నారని సెటైర్లు వేస్తున్నారు. ఏపీలో వైసీపీ నిర్వాకం జనాలకు అర్ధమైందని, దాంతో ఈసారి వారు ఎలాంటి చాన్సూ ఇవ్వరని అచ్చెన్న విశ్లేషిస్తున్నారు.

మహిళల మీద కుటుంబాల మీద కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేసే స్థాయిలో వైసీపీ నేతలు ఉన్నారని, ఇదేమి అన్యాయమని తమ పార్టీ వారు ఆందోళనలు చేస్తే వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ కూన రవికుమార్ ని అర్ధరాత్రి ఇంటి తలుపులు బద్ధలు కొట్టి మరీ అరెస్ట్ చేయడం బట్టి చూస్తే వైసీపీలో అసహనం ఎలా ఉందో బోధపడుతోందని కూడా అచ్చెన్న అంటున్నారు.

ఈ ప్రభుత్వం ఎన్ని అరెస్టులు చేసుకున్నా మిగిలింది రెండున్నరేళ్ళు మాత్రమే అని హెచ్చరిస్తున్నారు. ఆ తరువాత వచ్చేది కచ్చితంగా తామేనని, ఇంతకు ఇంతా తాము బదులు తీర్చుకుంటామని కూడా అచ్చెన్న ప్రతిన చేస్తున్నారు.

అచ్చెన్న ఈ మాటలు అనడం వెనక చాలానే కధ ఉందని తెలుస్తోంది. ఏపీ లో చంద్రబాబు కన్నీటి ఎపిసోడ్ తరువాత రాజకీయంగా కూడా టీడీపీకి ప్లస్ అయిందని అచ్చెన్న అంచనా కడుతున్నారు. ప్రత్యేకించి నందమూరి కుటుంబం దీని మీద ఘాటుగా స్పందించడం, తెలంగాణాతో పాటు పొరుగున ఉన్న తమిళనాడు నుంచి కూడా వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు చంద్రబాబుకు జరిగిన దాని మీద విచారం వ్యక్తం చేస్తూ ఫోన్ల మీద ఫోన్లు చేయ‌డం బట్టి చూస్తూంటే ఏపీలో ఒక్కసారిగా పొలిటికల్ గా టీడీపీకే మొగ్గు కనిపిస్తోందని ఆయన భావిస్తున్నారుట. సామాన్య జనాల్లో ఈ ఇష్యూ బాగానే వెళ్ళినట్లుగా కూడా లెక్కలు వేస్తున్నారు.

దాంతో ఆయన క్యాడర్ కి ధైర్యం చెబుతూ ఇప్పటికి సగం దూరం వచ్చేసాం, మరికొంత దూరం నడిస్తే చాలు కష్టాలు తీరిపోతాయని అంటున్నారు. వైసీపీ ఏలుబడికి ఏపీ జనాలు పలకడం ఇక స్వస్తివాచకం ఖాయమని అచ్చెన్న అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కుప్పం మునిసిపాలిటీ ఓటమితో కృంగిపోయిన టీడీపీకి రెండు రోజులు తిరగకుండానే ఏపీ రాజకీయ పరిస్థితుల్లో అనుకూలత వచ్చిందని అచ్చెన్న అంటున్నారుట.

ఆయనతో పాటు పార్టీ సీనియర్ నేత నిమ్మల రామానాయుడు లాంటి వారు కూడా వైసీపీ కధ ఇక ముగిసినట్లే అనేస్తున్నారు. ఇప్పటిదాకా చంద్రబాబు వంటి వారు ఇదే విషయాన్ని చెప్పినా పెద్దగా పట్టించుకోని సీనియర్ నేతలు ఇపుడు తామే ఈ మాట ధీమాగా అంటున్నారు. అంతే కాదు రానున్న రోజుల్లో కీలకమైన పరిణామాలు సంభవిస్తాయని ఇక టీడీపీలోకి భారీ వలసలు కూడా ఉంటాయని లెక్కలేస్తున్నారు. మొత్తానికి అచ్చే దిన్ టీడీపీకి వచ్చినట్లేనా అంటే తమ్ముళ్ల కాన్ఫిడెన్స్ మాత్రం వీర లెవెల్ లోనే ఉందని చెబుతున్నారు. చూడాలి మరి ఈ అంచనాలు లెక్కలు నిజమవుతాయా లేదా అన్నది.