Begin typing your search above and press return to search.

బాబాయ్ ఢిల్లీకి.. అబ్బాయ్ ఏపీకి!

By:  Tupaki Desk   |   9 Sep 2021 7:13 AM GMT
బాబాయ్ ఢిల్లీకి.. అబ్బాయ్ ఏపీకి!
X
మూడున్న‌ర ద‌శాబ్ద‌లకు పైగా రాజ‌కీయ జీవితం.. మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన అనుభ‌వం చంద్ర‌బాబు నాయుడిది. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2019 ఎన్నిక‌ల్లో యువ నాయ‌కుడు జ‌గ‌న్ ధాటి ముందు త‌ట్టుకోలేక ఘోర ప‌రాజ‌యంతో అధికారాన్ని కోల్పోయి మాజీ సీఎంగా మారిన బాబు.. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టారు. గ‌త ఎన్నికల్లో ఓట‌మితో ఢీలా ప‌డ్డ పార్టీని నాయ‌కుల‌ను కార్య‌క‌ర్త‌ల్లో తిరిగి ఉత్సాహం నింపే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారు. 38 ఏళ్ల‌కు పైగా చ‌రిత్ర ఉన్న తెలుగు దేశం పార్టీ ప్ర‌స్తుత ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. అటు తెలంగాణ‌లో ఎలాగో పార్టీ కోలుకునే ప‌రిస్థితి లేదు. ఇక ఏపీలోనే ఆ పార్టీకి మ‌నుగ‌డ ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే వచ్చే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం కోసం ప‌నిచేసే యువ సార‌థ్యం వైపు బాబు మొగ్గు చూపుతున్న‌ట్లు వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే బాబుకు 71 ఏళ్లు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రింత వ‌య‌సు మీద ప‌డుతోంది. బాబుకు అవే చివ‌రి ఎన్నిక‌లు కావొచ్చ‌నే ఊహాగానాలు ఇప్ప‌టికే జోరందుకున్నాయి. త‌న త‌ర్వాత పార్టీని న‌డిపించే బాధ్య‌త త‌న కొడుకు లోకేశ్ చేతుల్లో పెడ‌తార‌నే ప్ర‌చారం సాగుతోంది. రాజ‌కీయంగా లోకేశ్ బ‌ల‌హీనంగానే క‌నిపించిన‌ప్ప‌టికీ ఇటీవ‌ల ప్ర‌జ‌ల్లో ఉంటూ త‌న సామ‌ర్థ్యాన్ని పెంచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని టాక్‌. ఇప్ప‌టికే పార్టీలో చాలా మంది సీనియ‌ర్ల వ‌య‌సు 60 దాటిపోయింది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి చినబాబు కోసం యువ నాయ‌కుల‌తో కూడిన బృందం చురుగ్గా ప‌ని చేసే బ‌ల‌గం ఉండేలా బాబు ప్లాన్ వేస్తున్నార‌ని స‌మాచారం. అందుకే వ‌రుస‌గా రెండు సార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీకాకుళం యువ నేత కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడికి రాబోయే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల‌ని బాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

మాజీ ఎంపీ ఎర్ర‌న్నాయుడి రాజ‌కీయ వార‌సుడిగా అడుగుపెట్టి 2014 ఎన్నిక‌ల్లో శ్రీకాకుళం నుంచి రామ్మోహ‌న్ నాయుడు గెలిచారు. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ హ‌వాను త‌ట్టుకుని మ‌రీ రెండో సారి విజ‌యం ద‌క్కించుకున్నారు. అంతే కాకుండా ఎంపీగా పార్ల‌మెంట్‌లో త‌న‌దైన మాట‌ల‌తో ఆక‌ట్టుకుంటున్నారు. ఇటీవ‌ల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌వేటీక‌ర‌ణ‌పై వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తూ ఆయ‌న పార్ల‌మెంట్‌లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వంపై మాట‌ల‌తో విరుచుకుప‌డ్డ విధానం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అదే స‌మ‌యంలో ఇటు ఏపీలోనూ జ‌గ‌న్ అస‌మ‌ర్థ‌త కార‌ణంగానే కేంద్రం విశాఖ ఉక్కును ప్రైవేటు ప‌రం చేస్తుంద‌ని జ‌గ‌న్ ముందుండి అందుకు వ్య‌తిరేకంగా పోరాడాల‌ని డిమాండ్ చేశారు. స‌మ‌కాలీన రాజ‌కీయాల‌పై మంచి ప‌ట్టు గొప్ప వాగ్ధాటి క‌లిగిన రామ్మోహ‌న్‌నాయుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో టీడీపీకి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌గ‌ల‌ర‌ని బాబు భావించిన‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు రామ్మోహ‌న్ నాయుడు బాబాబ్ టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు గ‌తంలో మాదిరిగా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 1996లో ఎర్న‌న్నాయుడు ఎంపీగా పోటీ చేస్తే ఆయ‌న స్థానంలో అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే అయ్యారు. అప్ప‌టి నుంచి రాష్ట్ర రాజ‌కీయాల్లోనే కొన‌సాగుతున్నారు. కానీ ఇటీవ‌ల ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి బాబును ఇబ్బంది పెట్టేలా ఉంద‌నే నిపుణులు అనుకుంటున్నారు. తాను హోం మంత్రిని అవుతాన‌ని ఇటీవ‌ల ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కూడా బాబుకు రుచించడం లేద‌ని తెలిసింది. నిజానికి 2019 ఎన్నిక‌ల్లోనే అసెంబ్లీకి పోటీ చేయాల‌ని ఉంద‌ని రామ్మోహ‌న్ నాయుడు అనుకున్నారు. కానీ అప్ప‌టికే అచ్చెన్న మీద ఉన్న ఇష్టంతో బాబు. . రామ్మోహ‌న్ నాయుడిని ఢిల్లీకే పంపించారు. కానీ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి లోకేశ్‌కు యూత్ టీమ్ కావాలి కాబట్టి ఈ అబ్బాయిని ఏపీకి ర‌ప్పించి.. బాబాయ్ అచ్చెన్నాయుడిని ఢిల్లీకి పంపాల‌ని బాబు ప్లాన్ చేశార‌ని టాక్‌.