Begin typing your search above and press return to search.

బీజేపీపై కిన్నెర మొగులయ్య ఆగ్రహానికి కారణమిదేనా?

By:  Tupaki Desk   |   19 May 2022 7:46 AM GMT
బీజేపీపై కిన్నెర మొగులయ్య ఆగ్రహానికి కారణమిదేనా?
X
పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం.. భీమ్లా నాయక్‌లో ఒక పాట పాడి సర్వత్రా పాపులర్‌ అయిపోయారు.. కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన మొగులయ్య ఇంటిని నిర్మించుకోవడానికి పవన్‌ లక్షల రూపాయలు ఆర్థిక సాయం కూడా చేశారు. అంతరించిపోతున్న కళల జాబితాలో ఉన్న కిన్నెర వాయిద్య కళలో ప్రస్తుతం మిగిలిఉన్న ఏకైక కళాకారుడు.. మొగులయ్య మాత్రమే.

అలాగే.. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం కిన్నెర మొగులయ్యకు ఉగాది పురస్కారం ఇచ్చి సత్కరించింది. అయితే ఆయన అందరికీ తెలిసింది మాత్రం.. పవన్‌ కల్యాణ్‌ భీమ్లా నాయక్‌తోనే. అరుదైన కిన్నెర వాయిద్య కళకు ప్రాణం పోస్తున్న మొగులయ్యకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందించింది.

పద్మశ్రీ అందుకున్నాక కేసీఆర్‌ ప్రభుత్వం కిన్నెర మొగులయ్యకు కోటి రూపాయలు నగదుతోపాటు హైదరాబాద్‌లో 300 చదరపు గజాల స్థలాన్ని కూడా ఆయనకు ప్రకటించింది. అయితే అప్పటి నుంచి స్థానిక బీజేపీ నేతలు తనను వేధిస్తున్నారని మొగులయ్య తాజాగా ఓ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించాకే తనకు పేరొచ్చిందని.. కేసీఆర్‌ గుర్తించారని బీజేపీ నేతలు అంటున్నారని మొగులయ్య ఆరోపించారు.

బీజేపీ ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించకపోయి ఉంటే కేసీఆర్‌ ప్రభుత్వం తనను గుర్తించేది కాదని అంటున్నారని మొగులయ్య చెబుతున్నారు. స్థానిక బీజేపీ నేతలు తనను అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్‌ ఏమైనా తన జేబుల్లోంచి తీసి కోటి రూపాయలు ఇచ్చారా అని నిలదీస్తున్నారని, గొడవకు దిగుతున్నారని ఆవేదన చెందుతున్నారు. బీజేపీ ప్రభుత్వం పద్మశ్రీ ఇవ్వడం వల్లే తనకు ఇవన్నీ దక్కాయని అనవసర గొడవకు దిగుతున్నారని మొగులయ్య మండిపడుతున్నారు. బీజేపీ నేతలు ఇలాంటి వాటిని ఆపకపోతే పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేయడానికి కూడా వెనుకాడబోనని అంటున్నారు.

తాను నిరుపేద కుటుంబానికి చెందినవాడినని.. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ ఎలాంటి సంబంధాలు లేవని.. దయచేసి తనను అనవసర వివాదాల్లోకి లాగొద్దని మొగులయ్య తాజా వీడియోలో విజ్ఞప్తి చేశారు. దయ చేసి తన నోట్లో బీజేపీ నేతలు మన్ను కొట్టేలే వ్యవహరించవద్దని కోరారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తనకు ఎంతగానో సహాయపడ్డారని కొనియాడారు. తనను తొలిసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే గుర్తించిందని.. ఆరేళ్ల క్రితమే రవీంద్ర భారతిలో తనకు సత్కారం చేశారని గుర్తు చేశారు.