Begin typing your search above and press return to search.

కిరణ్ బేడీ - కబీర్ బేడీ ఇద్దరూ అడ్డంగా బుక్కయ్యారు!

By:  Tupaki Desk   |   4 Jan 2020 5:12 PM GMT
కిరణ్ బేడీ -  కబీర్ బేడీ ఇద్దరూ అడ్డంగా బుక్కయ్యారు!
X
సోషల్ మీడియాలో కనిపించే సమాచారంలో ఏది నిజమో? ఏది అబద్ధమో తెలుసుకోలేక మహామహులు సైతం బోల్తా పడుతున్నారు. తాజాగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ - సీనియర్ నటుడు కబీర్ బేడీ సైతం ఓ వీడియో నిజమని నమ్మి ట్విటర్ లో షేర్ చేసి నెటిజన్ల ట్రోలింగ్‌ కు గురయ్యారు.

ఇంతకీ విషయం ఏంటంటే సూర్యుడి నుంచి ఓం అనే శబ్దం వస్తోందని.. దాన్ని నాసా కూడా రికార్డు చేసిందని చెబుతూ ఆమె ఓ వీడియోను ట్విటర్ లో షేర్ చేశారు. నిజానికి ఈ నకిలీ వీడియో ఏమీ తాజాది కాదు. చాలాకాలంగా ఫేస్ బుక్, వాట్సాప్‌లలో చక్కర్లు కొడుతోంది. కిరణ్ బేడీ మొదటి సారి దీన్ని చూసినట్లున్నారు.. దాన్నే నిజమని నమ్మి ట్విటర్లో షేర్ చేశారు. ఆమె షేర్ చేసిన కొద్ది సేపటికే బాలీవుడ్ సీనియర్ నటుడు కబీర్ బేడీ కిరణ్ బేడీ ట్వీట్‌ ను రీ ట్వీట్ చేశారు. ఇంకేముంది నెటిజన్లు ఇద్దరినీ ట్రోల్ చేయడం ప్రారంభించారు.

కిరణ్ బేడీ విశ్రాంత ఐపీఎస్ కూడా కావడంతో.. ‘మీరు కూడా ఇలాంటి ఫేక్ వీడియోలను గుడ్డిగా నమ్మి షేర్ చేస్తే ఎలా?’ అంటూ కామెంట్ల వెల్లువ మొదలైంది. ఓ యూజర్ అయితే... ఇది ఫేక్ వీడియో అంటూనే అసలు వీడియోలో ఓం శబ్దంతో పాటు ఓం జై జగదీశ హరే అన్న శబ్ధం కూడా ఉంటుందని.. కిరణ్ బేబీ సరిగా వినలేదని అంటూ ఆటపట్టించారు.

నిజానికి నాసా ఈ వీడియోను ఎప్పుడో యూ ట్యూబ్‌ లో పెట్టింది. అందులో ఇదే వీడియో ఉంటుంది కానీ హోరున శబ్దం వినిపిస్తుంది. ఓం వంటి శబ్దాలేమీ ఉండవు. నాసా 40 రోజుల పాటు సూర్యుడి శబ్దాన్ని రికార్డు చేసి సేకరించిన వీడియో అది.