Begin typing your search above and press return to search.

ఏపీ గవర్నర్‌గా కిరణ్‌ బేడీ?

By:  Tupaki Desk   |   12 Feb 2017 3:56 AM GMT
ఏపీ గవర్నర్‌గా కిరణ్‌ బేడీ?
X
ఆంధ్రప్రదేశ్ కు త్వరలో గవర్నరు మారనున్నారా..? నరసింహన్ స్థానంలో మరో మాజీ ఐపీఎస్ గవర్నరుగా వస్తారా..? పాతికేళ్ల తరువాత మళ్లీ మహిళా గవర్నరు రానున్నారా..? ఇంతకీ ఎవరా కొత్త గవర్నరు..? ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే. ఏపీలో జరుగుతున్న నేషనల్ ఉమన్ పార్లమెంటుకు వచ్చిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరు కిరణ్ బేడీ ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశం కావడంతో ఇద్దరి మధ్యా గవర్నరుగిరీపై చర్చలు జరిగాయన్న ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌గా కిరణ్‌ బేడీ నియమితులయ్యే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. ప్రస్తుతం పుదుచ్చేరి గవర్నరుగా ఉన్న కిరణ్ బేడీ తనకు ఏపీ గవర్నరుగిరీ ఇప్పించాలంటూ కేంద్రాన్ని కోరినట్లు తెలుస్తోంది. కేంద్రం కూడా దీనిపై సానుకూలంగా ఉందని... త్వరలో దీనిపై ప్రకటన రావొచ్చని టాక్.

ఏడాది క్రితం పుదుచ్ఛేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బేడీ నియమితులయ్యారు. అయితే అక్కడి ప్రభుత్వానికి, ఆమెకు మధ్య ఘర్షణ వాతావరణమే ఉంది. ఆరేళ్ళ పదవీకాలమున్నప్పటికీ రెండే ళ్ళు మాత్రమే పదవిలో కొనసాగు తానంటూ ఇటీవలె ఆమె రెండుసార్లు ప్రకటించారు. ఆ రాష్ట్ర పరిస్థితులతో పాటు అక్కడున్న వాతావ రణం కూడా బేడీకి నచ్చడంలేదట.

ఈ పరిస్థితుల్లో ఆమె ఒకే గవర్నరు ఉన్న రెండు రాష్ట్రాల్లో ఒకటైన ఏపీకి గవర్నరుగా వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుతో పెద్దగా ఇబ్బందులు ఉండే అవకాశాలు లేకపోవడం.. కొత్త రాష్ట్రం కావడం.. చంద్రబాబుకు కేంద్రంతో మంచి సంబంధాలు ఉండడం వంటి అన్ని కారణాలు చూసుకుని ఆమె ఏపీపై ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ అంశంపై చర్చించి చంద్రబాబు ఆసక్తిని అంచనాలేసేందుకే బేడీ విజయవాడకొచ్చినట్లు సమాచారం.

వాస్తవానికి జాతీయ మహిళా పార్లమెంట్‌లో ఆమె శనివారం ప్రసంగించాల్సుంది. కానీ తన కార్యక్రమాన్ని ఓ రోజు ముందుకు జరిపించారు. తొలిరోజు శుక్రవారమే ఆమె ప్రసంగించేశారు. ఇందుకోసం గురువారం రాత్రే విజయవాడకు చేరుకున్నారు. విజయవాడలో చంద్రబాబు, కిరణ్‌బేడీల మధ్య సమావేశం జరిగిందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. బేడీ గవర్నరుగిరీపైనే వారిమధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా నరసింహన్‌ వ్యవహరిస్తున్నారు. ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఉన్నారు. గత ఏడాదిగా రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్‌లను నియమించాలన్న ప్రతిపాదన ఉంది.

కాగా నరసింహన్‌లాగే బేడీ కూడా మాజీ ఐపిఎస్‌ అధికారే. విధుల నిర్వహణలో ఆమె నిబద్దత అంతర్జాతీయ గుర్తింపు పొందింది. సామాజిక ఉద్యమాల్లోనూ ఆమె కీలకపాత్ర పోషించారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో ఆమె ముందు నిలిచారు. ప్రధాని మోడి కూడా బేడీకి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఢిల్లి అసెంబ్లి ఎన్నికల్లో బిజెపి గెలిచుంటే కిర ణ్‌ బేడీయే ముఖ్యమంత్రయ్యుండేవారు. పార్టీ గెలవకపోయినా బేడీకి గవర్నరుగిరీ ఇచ్చి ప్రయారిటీ ఇచ్చారు. బిజెపి నేతలు ఎందరో పదవుల్ని ఆశిస్తున్నప్పటికీ వారందర్నీ పక్కనపెట్టి బేడీకి పుదుచ్ఛేరి గవర్నర్‌ బాధ్యతలప్పగించారు. ఇప్పుడు కూడా బేడీ ప్రతిపాదనల్ని నరేంద్రమోడి తిరస్కరించరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాట్లాడితే మహిళ మహిళ అనే చంద్రబాబు కూడా మహిళా గవర్నరు ప్రతిపాదనకు నో చెప్పరని భావిస్తున్నారు.