Begin typing your search above and press return to search.

మనసులో మాట చెప్పినందుకు ఆక్షింతలు

By:  Tupaki Desk   |   20 Jan 2015 7:45 AM GMT
మనసులో మాట చెప్పినందుకు ఆక్షింతలు
X
మనసులో మాట చెప్పనందుకు నొచ్చుకుంటారు ఎవరైనా. కానీ.. బీజేపీ నేత తన మనసులోని మాట చెప్పినందుకు ఆక్షింతలు పడిన పరిస్థితి. టైం కాని టైంలో మనసులోని మాటను బయటకు చెప్పటంతో ఇలాంటి పరిస్థితి ఎదురైంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ని మొత్తంగా మార్చేసేందుకు వీలుగా బీజేపీ వేసిన మాస్టర్‌ప్లాన్‌తో.. ప్రత్యర్థి పార్టీలన్నీ కంగుతినే పరిస్థితి. అదే సమయంలో బీజేపీలోని సీనియర్‌ నేతల్లోనూ అసంతృప్తి రాజుకునేలా చేసింది. ప్రధాని మోడీ పుణ్యమా అని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విధంగా విజయం సాధిస్తామని.. ఆ వెంటనే పదవులు పంచుకోవచ్చని చాలానే కలలు కన్నారు.

ఆ కలల్ని కల్లలు చేస్తూ బీజేపీ అధినాయకత్వం సీన్లోకి తొలి మహిళా ఐపీఎస్‌ అధికారిణి కిరణ్‌బేడిని ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించటంతో మొత్తంగా మారిపోయింది. దీంతో అప్పటివరకూ ముఖ్యమంత్రి పదవిని మొదలుకొని.. కీలక పదవుల్ని ఆశించిన నేతలకు కరెంటు షాక్‌ కొట్టినట్లుగా మారింది.

నోటి దాకా వచ్చిన పండు చేజారితే ఎలాంటి పరిస్థితో.. సరిగ్గా అలాంటి పరిస్థితే ఢిల్లీ బీజేపీ నేతలది. జరుగుతున్న పరిణామాల్ని చూస్తూ ఉండలేరు. అలా అని మాట్లాడితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలిసిందే. అందుకే కిందామీదా పడిన నేతలు దూరదృష్టితో కామ్‌గా ఉండిపోతే.. ఒకరిద్దరు నేతలు మాత్రం తమ అసంతృప్తిని బయటకు చెప్పేందుకు డిసైడ్‌ అయ్యారు.

అలా మనసులోని అసంతృప్తిని బయటకు పెట్టిన నేతల్లో ఎంపీ మనోజ్‌కుమార్‌ తివారీ ఒకరు. కిరణ్‌బేడీ రాకపై తన అసంతృప్తిని బాహాటంగానే బయటపెట్టిన ఆయన తీరుపై కాస్త ఘాటుగానే రియాక్ట్‌ అయ్యారు. దీనిపై బీజేపీ అధినాయకత్వం వెంటనే స్పందించింది. మనోజ్‌కుమార్‌ని లైన్లోకి తీసుకొని చెప్పాల్సిన రీతిలో చెప్పేయటంతో పాటు పార్టీకి నష్టం చేసే ఇలాంటి వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలన్న ఆదేశంతో మనోజ్‌కుమార్‌ స్పందించారు.

తానుగా తప్పుగా మాట్లాడలేదని.. తన మనసులోని మాటను చెప్పానన్న ఆయన.. కిరణ్‌బేడీని ఏమీ అనలేదని.. పార్టీలో చేరిన వారు పార్టీలో ఉన్న అందరిమాదిరి ప్రవర్తించాలే కానీ వేరుగా కాదని మాత్రమే అన్నానని చెప్పుకున్నారు.

తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే అందుకు విచారిస్తున్నానని చెప్పారు. ఇన్ని మాటలు చెప్పిన ఆయన.. తన చేతలతో మాత్రం తాను రాజీపడలేదని తేల్చేశారు. ఢిల్లీ నగరానికి చెందిన ఎనిమిది మంది ఎంపీలను 'టీ' కోసం ఇంటికి ఆహ్వానించారు. అయితే.. ఈ కార్యక్రమానికి మనోజ్‌తివారీ మాత్రం హాజరు కాలేదు. కిరణ్‌బేడీ ఇంటికి వెళ్లటం సముచితం కాదని భావించటం వల్లే తాను వెళ్లలేదంటూ చెప్పుకున్నారు. మొత్తానికి మాటలెన్ని చెప్పినా చేతల్లో మాత్రం తాను చేయాల్సింది చేసేశారని చెప్పాలి.