Begin typing your search above and press return to search.

ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్ గా కిర‌ణ్ బేడీ?

By:  Tupaki Desk   |   25 March 2018 6:32 AM GMT
ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్ గా కిర‌ణ్ బేడీ?
X
కొద్ది రోజులుగా ఏపీలో ప్ర‌త్యేక హోదాపై కేంద్రం వైఖ‌రికి నిర‌స‌న‌గా ఆందోళ‌న‌లు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌ల బ‌రిలో స‌త్తా చాటేందుకు అన్ని పార్టీలు సిద్ధ‌మ‌వుతున్నాయి. దానికితోడు ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్ ప‌ద‌వీకాలం కూడా ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఏపీ - తెలంగాణ‌ల‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్ ల‌ను నియ‌మించే యోచ‌న‌లో కేంద్రం ఉన్న‌ట్లు తెలుస్తోంది. కేంద్రంపై ఏపీలో ఉన్న వ్య‌తిరేక‌త‌ - తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీకి పూర్తి స్థాయి గవర్నర్ ను నియమించాల‌ని మోదీ స‌ర్కార్ స‌న్నాహాలు చేస్తోంద‌ని తెలుస్తోంది. ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా విధులు నిర్వ‌ర్తిస్తోన్న కిరణ్ బేడీని ఏపీకి నియ‌మించే అవ‌కాశం ఉంద‌ని పుకార్లు వినిపిస్తున్నాయి.

ఏపీకి కిరణ్ బేడీతోపాటు తెలంగాణ గవర్నర్ గా మాజీ ప్రిన్సిప‌ల్ సెక్రటరీ సీవీఎస్కే శర్మ పేరు కూడా తెర‌మీద‌కు వ‌చ్చిందట‌. ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించాలని కేంద్రాన్ని బీజేపీ నేత‌లు కోరారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు జనవరి 11న ఆ అంశం గురించి ఓ లేఖ కూడా రాశారు. న‌ర‌సింహ‌న్ హైద‌రాబాద్ లో నివాసం ఉండ‌డం వ‌ల్ల ఏపీకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న భావ‌న‌తో ఏపీ ప్రజలున్నారని, అందువ‌ల్ల ఏపీకి పూర్తిస్థాయి గవర్నర్ నియ‌మించాల‌ని కోరారు. ఏపీలో మారిన రాజ‌కీయ‌ప‌రిణామాలు, బీజేపీతో టీడీపీ తెగ‌దెంపులు చేసుకోవ‌డం వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని కిర‌ణ్ బేడీని ఏపీకి నియ‌మించాల‌ని కేంద్రం ఫిక్స్ అయింద‌ని తెలుస్తోంది. అయితే, ఏపీలో రాజ్ భవన్ లేకపోయినా....గ‌వ‌ర్న‌ర్ కు తాత్కాలిక‌ ప్ర‌త్యేక భ‌వ‌నంతో పాటు స‌దుపాయాలు క‌ల్పించవచ్చని రాష్ట్ర బీజేపీ నేత‌లు ...కేంద్రానికి చెప్పిన‌ట్లు తెలుస్తోంది.