Begin typing your search above and press return to search.

టి లో కిరణ్ కుమార్ రెడ్డి ఎఫెక్టు నిజమేనా..?

By:  Tupaki Desk   |   14 Sep 2015 7:29 AM GMT
టి లో కిరణ్ కుమార్ రెడ్డి ఎఫెక్టు నిజమేనా..?
X
ఉమ్మడి రాష్ర్ట చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో తీసుకున్న నిర్ణయం తెలంగాణలో కొందరు ఉద్యోగులకు ఇప్పుడు ఇబ్బంది కలిగిస్తోంది. అయితే... ఆ ప్రభావాన్ని తొలగించడం ప్రస్తుత ప్రభుత్వం చేతిలో ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు జరగడంలేదు.

గత ఏడాది జూన్ 2న అపాయింటెడ్ డే వచ్చింది. తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటింది. అయినా... ఉద్యోగులకు మాత్రం ఇప్పటి వరకు ప్రమోషన్ లు లేవు. సమైక్యాంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రమోషన్ లపైన నిషేధం విధించడమే దీనికి కారణం. 2013 నుంచి ఈ నిషేధం కొనసాగుతోంది. ప్రమోషన్ ల పైన నిషేధం అనంతరం... ఇప్పటి వరకు వేలాది మంది ఉద్యోగులు రిటైర్ మెంట్ అయ్యారు. వీరు ప్రమోషన్ లు, వాటికి సంబంధించిన ప్రయోజనాలు పొందకుండానే రిటైర్ కావాల్సి వచ్చింది.

ప్రస్తుతం తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ అంశం సమస్య కొలిక్కి రాలేదు. త్వరలో కొలిక్కి వచ్చే అవకాశముంది. అయితే, ఇప్పటికే ఉద్యోగుల పంపిణీ పూర్తి అయిన 45 విభాగాలలో ప్రమోషన్ ల విషయమై దృష్టి సారించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రమోషన్ ల విషయమై ఉద్యోగుల పంపిణీ అంశాన్ని చూపించవద్దని కోరుతున్నారు. కాగా తెలంగాణలో ఇది సమస్యగా మారినా ఏపీలో మాత్రం సచివాలయం, ఇతర విభాగాల్లో ఏపీ ప్రమోషన్ లను అమలు చేస్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నట్లుగా కిరణ్ కుమార్ రెడ్డి విధించిన నిషేధం ప్రమోషన్ లకు అడ్డంకి అయితే ఏపీలో కూడా అది వర్తించాలి.. కానీ అక్కడ ప్రమోషన్ లు ఇస్తున్నారు... దీంతో తెలంగాణ ప్రభత్వం ప్రమోషన్ లు ఇవ్వకుండా నెపం కిరణ్ ప్రభుత్వంపై నెట్టేస్తుందని అక్కడి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.