Begin typing your search above and press return to search.

కిరణ్‌ కు కాంగ్రెస్ కండువా క‌ప్పిన రాహుల్‌

By:  Tupaki Desk   |   13 July 2018 9:19 AM GMT
కిరణ్‌ కు కాంగ్రెస్ కండువా క‌ప్పిన రాహుల్‌
X
అంచ‌నాలు నిజ‌మ‌య్యాయి. మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి ఎంత ఎట‌కారం చేసినా.. కాంగ్రెస్‌లో ఆయ‌న రీఎంట్రీ మీడియాలో వ‌చ్చిన వార్త‌లు.. అంచ‌నాలే నిజ‌మ‌ని తేలిపోయింది. రాష్ట్ర విభ‌జ‌న‌ను వ్య‌తిరేకిస్తూ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. జై స‌మైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేసిన ఉమ్మ‌డి రాష్ట్ర చివ‌రి ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ లోకి రీఎంట్రీ ఇచ్చారు. శుక్ర‌వారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో రాహుల్ స‌మ‌క్షంలో చేరిన ఆయ‌న వెంట కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జ్ ఊమెన్ చాందీ.. పీసీసీ చీఫ్ ర‌ఘువీరా త‌దిత‌రులు ఉన్నారు.

పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చే ముందు యూపీఏ ఛైర్ ప‌ర్స‌న్ సోనియాగాంధీతో కిర‌ణ్ భేటీ అయ్యారు. అనంత‌రం పార్టీలో చేరుతున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు. పార్టీలో చేర‌టానికి ముందు కోస్తాంధ్రాకు చెందిన ప‌లువురు కీల‌క నేత‌ల‌తో కిర‌ణ్ భేటీ అయ్యారు.

పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత కిర‌ణ్ మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే విభ‌జ‌న హామీలు అమ‌ల‌వుతాయ‌న్నారు. రాహుల్ నాయ‌క‌త్వాన్ని బ‌లోపేతం చేసేందుకే కాంగ్రెస్‌లో చేరిన‌ట్లుగా వెల్ల‌డించారు. పార్టీ అధినాయ‌క‌త్వం అప్ప‌గించే ఏ ప‌నినైనా చేయ‌టానికి తాను సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. రాహుల్ ప్ర‌ధాని అయితే తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి ఉంటుంద‌న్నారు.

ప్ర‌ధాన‌మంత్రి పార్ల‌మెంటులో చెప్పిన మాట చ‌ట్టంతో స‌మాన‌మ‌న్న ఆయ‌న‌.. ఏపీకి ప్ర‌త్యేక హోదా హామీని నెర‌వేర్చాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. విభ‌జ‌న హామీల్ని అమ‌లు చేయ‌టంలో బీజేపీ పూర్తిగా విఫ‌ల‌మైంద‌న్న ఆయ‌న‌.. త‌న రీఎంట్రీతోనే బీజేపీపై విమ‌ర్శ‌నాస్త్రాల్ని ఎక్కు పెట్ట‌టం గ‌మ‌నార్హం.