Begin typing your search above and press return to search.

జగన్ ఆలోచన తప్పు అంటున్న మాజీ సీఎం కిరణ్

By:  Tupaki Desk   |   25 Nov 2022 9:44 AM GMT
జగన్ ఆలోచన తప్పు అంటున్న మాజీ సీఎం కిరణ్
X
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని విప్లవాత్మకమైన ఆలోచనలు తీసుకున్నారు. వాటి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ అందులో ముఖ్యమైనది. అదే సమయంలో మూడు రాజధానులు వంటివి మాత్రం ఇబ్బందులను తెచ్చే పరిణామాలుగా అంతా చెబుతున్నారు. నిజానికి ఎగ్జిక్యూటివ్, లెజ్లిస్లేటివ్, జ్యుడీషియరీ సిస్టమ్స్ మూడు కలసికట్టుగా ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. ఇవి ఒకదానితో ఒకటి అనుసంధానం అవుతూ ప్రజలకు మేలు చేసే విషంలో కీలకంగా ఉంటాయి.

అందువల్ల ఈ వ్యవస్థలు మూడూ ఒకే చోట ఉండడం అన్ని విధాలుగా మంచిది అని ఉమ్మడి ఏపీకి చిట్టచివరి సీఎం గా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఈ విషయంలో జగన్ ప్రభుత్వం తలపెట్టిన మూడు రాజధానులు విధానం తప్పు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. ప్రముఖ నటుడు నందమూరి బాలక్రిష్ణ ఓటీటీ ద్వారా నిర్వహించే అన్ స్టాపబుల్ ప్రోగ్రాం కి గెస్ట్ గా వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఏపీకి కుదిపేస్తున్న కీలకమైన అంశం మూడు రాజధానుల మీద తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

మూడు రాజధానులు ఏర్పాటు అన్నది అసమంజసమైన ప్రతిపాదనగానే కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ప్రజాస్వామ్యానికి శాసన, కారనిర్వహణ, న్యాయ వ్యవస్థలు మూడూ మూల స్థంభాలు అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో వీటిని విడదీయడం మంచింది కాదని అన్నారు. దీని వల్ల ఆర్ధికంగానే కాకుండా అన్ని విధాలుగానూ ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు.

శాసనసభ పనిచేస్తున్నపుడు అధికారులు ముఖ్యమంత్రి, మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ శాసనసభలో ఉండాల్సిన అవసరం ఉంది అని ఆయన గుర్తు చేశారు. అలాగే ఏదైనా అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్ట్ ని కానీ పధకాన్ని కానీ సమీక్షించాలన్న మంత్రులు అధికారులు అంతా ఒకే చోట ఉంటేనే వేగంగా పనులు జరుగుతాయని అన్నారు. ఇక ప్రభుత్వం ఏదైనా ఒక దాన్ని కోర్టులో సవాల్ చేయాలంటే మంత్రులు, ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వారంతా అలా కూడా అందుబాటులో ఉంటేనే అది సాధ్యపడుతుందని అన్నారు.

ఇలా మూడు వ్యవస్థలు ఒకదాని మీద మరోకటి ఆధారపడి పనిచేస్తాయని, అందువల్ల ఈ శాఖలను వేరు వేరు చేయడం వల్ల కాలయాపనతో పాటు పనిలో నాణ్యాత కూడా తగ్గిపోతుంది అని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మొత్తానికి చూస్తే ఏపీలో మూడు రాజధానులు అంటున్న జగన్ నిర్ణయం తప్పు అని మాజీ సీఎం గట్టిగానే చెప్పారన్నమాట.

అది ఆర్ధికంగానే కాదు ఇతరత్రా ఇబ్బంది అని తెలిసినా కూడా జగన్ సర్కార్ ముందుకే అంటోంది. మరి ఈ విషయంలో బయట అంతా వద్దు అనే చెబుతున్నారు. కానీ జగన్ దీని మీద పట్టు వీడడంలేదు, ఆయనకు ఈ విషయంలో నచ్చచెప్పి మూడు కాదు, ఒకటే రాజధాని అని తెలియచెప్పేలా మంత్రులు కానీ సీనియర్ నాయకులు కానీ చేయలేరా అంటే ఏమో చూడాల్సి ఉంటుంది మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.