Begin typing your search above and press return to search.

కీర్తి మీద వేటు వేశారు

By:  Tupaki Desk   |   24 Dec 2015 4:20 AM GMT
కీర్తి మీద వేటు వేశారు
X
కంట్లో నలకలా మారి.. సొంత పార్టీకే సినిమా చూపిస్తున్న సభ్యుడిపై కమలనాథులు కన్నెర్ర చేశారు. అధికారపక్ష సభ్యుడిగా ఉంటూ విపక్షానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయటం..తన మాటలతో పార్టీకి తలనొప్పిగా మారిన బీజేపీ ఎంపీ కీర్తి అజాద్ ను పార్టీ అధినాయకత్వం సస్పెండ్ చేసింది. బీహార్ లోని దర్భాంగా లోక్ సభ స్థానం నుంచి గత మూడుసార్లుగా గెలుపొందిన ఈ మాజీ క్రికెటర్.. ఇటీవల కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మీద తరచూ విమర్శలు చేయటం తెలిసిందే.

ఢిల్లీ క్రికెట్ సంఘం విషయంలో పార్టీలో కీలక నేత.. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో ఉన్న వ్యక్తిగత పంచాయితీ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నట్లుగా కీర్తి అజాద్ వ్యవహరించటం బీజేపీని ఇరకాటంలో పడేస్తోంది. ఆయన చేస్తున్న ఆరోపణలు.. ఢిల్లీ రాష్ట్ర అధికారపక్షమైన ఆమ్ఆద్మీ పార్టీకి బలంగా మారింది. రోజురోజుకి పెరుగుతున్న ఈ వ్యవహారంలో పార్టీ ప్రయోజనాల కంటే తన సొంత ఎజెండాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ.. జైట్లీపై కీర్తి అజాద్ విమర్శలు చేస్తున్నారు.

దీంతో.. మోడీ సర్కారు తీవ్ర ఇబ్బందులు పడుతోంది. విపక్షం కంటే స్వపక్షానికి చెందిన కీర్తి అజాద్ మాటలు ఎన్డీయే సర్కారు పరపతిని తీవ్రంగా దెబ్బ తీస్తున్న పరిస్థితి. అరుణ్ జైట్లీ మీద కీర్తి చేస్తున్న వ్యాఖ్యలు విపక్షాలకు వరంగా మారాయి. ఇద్దరి మధ్య పంచాయితీ సెటిల్ చేసేందుకు బీజేపీ అధినాయకత్వం ప్రయత్నించినా కీర్తి వెనక్కి తగ్గకపోవటంతో.. కమలనాథులకు వేటు వేయక తప్పింది కాదు.

అరుణ్ జైట్లీ గతంలో ఢిల్లీ క్రికెట్ సంఘం ఛైర్మన్ గా ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయని కీర్తి అజాద్ ఆరోపిస్తున్నారు. కేంద్రమంత్రి మీద సొంత పార్టీ ఎంపీ అవినీతి ఆరోపణలు చేయటం.. విపక్షాలకు ఓ అస్త్రంగా మారింది. అజాద్ వ్యాఖ్యలు పార్టీకి చేటు చేయటంతో పాటు.. కేంద్ర సర్కారును తీవ్ర ఇబ్బందుల్లో పడేస్తున్నాయని.. వెంటనే ఆ వ్యాఖ్యల్ని ఉప సంహరించుకోవాలంటూ పార్టీ చేసిన ప్రయత్నాల్ని పట్టించుకోకపోవటంతో.. అతనిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది.