Begin typing your search above and press return to search.

మోదీకి ప్ర‌త్యామ్నాయాన్ని కొట్టిపారేసిన అమిత్ షా

By:  Tupaki Desk   |   20 Dec 2018 7:52 AM GMT
మోదీకి ప్ర‌త్యామ్నాయాన్ని కొట్టిపారేసిన అమిత్ షా
X
రాజ‌స్థాన్ - మ‌ధ్య‌ప్ర‌దేశ్ - ఛ‌త్తీస్ గ‌ఢ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌మ‌ల‌నాథుల‌ ఘోర ప‌రాజ‌యం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. వారి నాయ‌క‌త్వ సామ‌ర్థ్యంపై అనేక‌ ప్ర‌శ్న‌లు లేవనెత్తింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యంపై అనుమానాలు రేకెత్తించింది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాలంటే నాయ‌క‌త్వాన్ని మార్చాల్సిందేన‌న్న వాద‌న‌ల‌కు తావిచ్చింది.

ఇందులో భాగంగానే ఇటీవ‌ల ఆరెస్సెస్ చీఫ్ భగవత్ కు - జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషిల‌కు మ‌హారాష్ట్రలోని ఓ రైతు సంఘం నేత సంధించిన లేఖాస్త్రం ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. అహంకార మోదీని తొలగించి ఆయ‌న‌ స్థానంలో నితిన్ గడ్కరీని ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విలో కూర్చోబెట్టండి అంటూ రైతు సంఘం నేత అందులో సూచించారు. దీంతో మోదీకి ప్ర‌త్యామ్నాయం అనే అంశంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ న‌డుస్తోంది.

తాజాగా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మోదీకి ప్ర‌త్యామ్నాయం అనే విష‌యం అమిత్ షా ముందుకు వ‌చ్చింది. దీంతో ఆయ‌న స్పందించ‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి ఏర్పడింది. అయితే - మోదీకి ప్ర‌త్యామ్నాయం అవ‌స‌రం లేదంటూ షా తేలిగ్గా చెప్పారు. మోదీ నాయ‌క‌త్వంలోనే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల బ‌రిలో దిగుతామ‌ని స్ప‌ష్టం చేశారు. మ‌ళ్లీ కేంద్రంలో త‌మ ప్ర‌భుత్వం ఏర్పాటు కావ‌డం ఖాయ‌మ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు.

కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు ప్రతిపాదిస్తున్న మహా కూటమితో త‌మ‌కు ఏమాత్రం భ‌యం లేద‌ని షా ఉద్ఘాటించారు. కూట‌మికి ఓట‌మి త‌ప్ప‌ద‌ని ఎద్దేవా చేశారు. లోక్‌ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. మోదీ మ‌ళ్లీ ప్ర‌ధాని పీఠ‌మెక్కుతార‌ని జోస్యం చెప్పారు. లోక్‌ స‌భ ఎన్నిక‌ల‌ను - అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఒకేలా చూడొద్ద‌ని చెప్పారు.

అయితే - బీజేపీకి మాతృసంస్థ అయిన ఆరెస్సెస్ కూడా కొన్నేళ్లుగా మోదీ, షాల‌ను ట‌చ్ చేసేందుకు వెనుకంజ వేస్తోంద‌ని విశ్లేష‌కులు గుర్తుచేస్తున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మితో ఈ ప‌రిస్థితులో మార్పు రావ‌డం ఖాయ‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇక బీజేపీలో మోదీ-షా ద్వ‌యం ఏక‌ఛ‌త్రాధిప‌త్యానికి తెర‌ప‌డ్డ‌ట్లేన‌ని పేర్కొన్నారు.