Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా ముసలాయన పొట్ట కొట్టింది….

By:  Tupaki Desk   |   23 Sep 2015 5:29 PM GMT
సోషల్ మీడియా ముసలాయన పొట్ట కొట్టింది….
X
సమాజంలో చాలా మందికి పాపులర్ అవ్వాలనే కోరిక ఉంటుంది. ఇందుకోసం మీడియాలో ప్రచారం జరగాలని ఏవేవో కొంటే పనులు చేస్తుంటారు. వివాదాస్పద కామెంట్లు కూడా చేస్తుంటారు. అయితే అనుకోకుండా పతాక శీర్షికల్లోకి ఎక్కిన ఓ వ్యక్తి తనను ప్రశాంతంగా వదిలేయాలని వేడుకుంటున్నాడు. అయితే ఆయనేమీ తప్పు చేసిన వ్యక్తి కాకపోవడం ఈ ఎపిసోడ్ లో పెద్ద ట్వీస్ట్.

ఉత్తరప్రదేశ్ రాష్ర్టంలోని లక్నోలో ఓ పాతటైప్ రైటింగ్ మెషిన్ తో ఫుట్ పాత్ పై పనిచేసుకుంటున్న కిషన్ కుమార్ ను ఖాళీ చేయించేందుకు ఇటీవల వెళ్లిన ఓ ఎస్సై దురుసుగా ప్రవర్తించాడు. అక్కడ్నుంచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ డొక్కు టైప్ రైటర్ ను లాక్కొని విసిరికొట్టాడు. అయితే ఈ ఘటన తాలుకు ఫొటోలు, వీడియోలు ఫేస్ బుక్ , వాట్సాప్, ఇతర సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పోస్ట్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా కిషన్ కుమార్ పై సానుభూతి పెళ్లు ఉబికింది. సదరు ఎస్సైపై ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన్ను అధికారులు సస్పెండ్ చేశారు. కొత్త టైప్ రైటర్ కొనిస్తామని, రూ.లక్ష పరిహారం అందజేస్తామని ప్రకటించారు.

మరోవైపు ఆయనకు భద్రతా పరమైన ఇబ్బందులు ఎదురవుతావాయని భావించిన పోలీసు రోజూ ఆయన ఇంటికివెళ్లి తీసుకొనివచ్చి పనిచేసుకుంటున్న పాత పోస్టాపీసు వద్ద వదిలిపెడుతున్నారు. పాపులర్ ఫిగర్ అయిన నేపథ్యంలో ఆయన్ను ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా సైతం ఆసక్తి చూపిస్తోంది. అయితే ఇది కిషన్ సింగ్ కు తలనొప్పిగా మారింది!

పనిచేస్తూ పొట్టపోసుకునే తనకు ఈ హడావుడితో ఒక్క గిరాకీ రావడంలేదని ఆయన వాపోతున్నారు. తనకు పనిచేయకపోతే జీవితం గడిచే పరిస్థితి లేదని…అందుకే తనను మీడియా, ఇతర వర్గాలు వదిలిపెట్టేయండి బాబోయ్ అంటూ విన్నవించుకుంటున్నాడు. ఆర్థికసహాయం చేస్తామని ఎందరో ప్రకటిస్తున్నా….ఇప్పటికీ ఒక్కరూపాయి కూడా రాలేదని నిరుత్సాహం వ్యక్తం చేశారు.