Begin typing your search above and press return to search.

సర్దార్ ఎక్కడ...సర్కార్ కూల్చేవారు ఎక్కడ...?

By:  Tupaki Desk   |   17 Sep 2022 3:30 PM GMT
సర్దార్ ఎక్కడ...సర్కార్ కూల్చేవారు ఎక్కడ...?
X
ఈ దేశం కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన వారు త్యాగధనులు. అలాంటి వారు తొలితరంలో దేశంలో కీలక బాధ్యతలు స్వీకరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషిగా ఆనాడు పేరు తెచ్చుకున్నారు అంటే ఆయన లెక్కలేనితనం దేశద్రోహుల మీద తప్ప తమ మాటే నెగ్గాలన్న‌ కుత్సిత రాజకీయాల పంతాల మీద కాదు. ఇక అఖండ భారతం కోసం నాడు పటేల్ పడిన కష్టమే ఈ రోజు భారత్ ఈ విధంగా ఉండడం. దేశంలో నాడు ఉన్న వందలాది సంస్థానాలను పటేల్ కలిపారు

దాని కోసం సామదాన భేద దండోపాయాలను ఆయన ఉపయోగించారు. మొత్తానికి హైదారాబాద్ రాష్ట్రం దేశంలో విలీనం అయింది. ఇదీ తెలిసిన చరిత్ర. ఇక దేశానికి తొలి హోం మంత్రిగా ఉన్న పటేల్ తాను ఉన్న కొద్ది కాలంలోనే తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన నిస్వార్ధపరుడు. నిరంతరం దేశం కోసమే తప్ప తన కోసం ఆలోచన చేయనివారు. అందుకే ఆయనను తొలి ప్రధానిగా ఎన్నుకోవాలని కాంగ్రెస్ లోనే ఎక్కువ మంది కోరినా నాటి రాజకీయాలను చూసి దేశం ముఖ్యమనుకుని తొలి ప్రధాని నెహ్రూ అయినా అంగీకరించి ఆయన వద్ద హోం మంత్రిగా పనిచేశారు.

అలా నిరాడంబత్వం, నిస్వార్ధం, దేశం కోసం తుదికంటా నిలబడడం పటేల్ కి పెట్టని ఆభరణాలు. ఆయనతో ఎవరికీ ఏ కోశానా పోలిక లేనే లేదు. అందునా ఈ తరం వారు అసలు సరిపోరు. అయితే బీజేపీ వారు ప్రతీ సారి తమ నాయకులను పటేల్ తో పోల్చుకుంటూ తృప్తి పడుతూంటారు. ఒకనాడు ఇదే బీజేపీలో ఎల్కే అద్వానీని ఉక్కు మనిషి పటేల్ తో పోల్చారు. ఇపుడు అద్వానీ పక్కకు వెళ్లారు. ఆ ప్లేస్ లో అమిత్ షా వచ్చారు. ఆయన్ని అభినవ పటేల్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెగ పొగుడుతున్నారు.

ఈ పోలికకు ఏమైనా సారూప్యం ఉందా అని జాతిజనులు నివ్వెర పోతున్నారు. అమిత్ షా అభినవ పటేల్ ఎలా అవుతారు అని నెటిజన్ల నుంచి సెటైర్లు పడుతున్నాయి. సంస్థానాలను కలిపి అఖండ భారతాన్ని నిర్మించిన సర్దార్ ఎక్కడ, వరసబెట్టి సర్కార్లను కూల్చుతూ తమ పార్టీ పాగాను వేస్తూ పోతున్న బీజేపీ నేత అమిత్ షా ఎక్కడ అని కామెంట్స్ పడుతున్నాయి. విపక్ష ప్రభుత్వాల మీద కక్ష పూనినట్లుగా కూల్చేస్తూ కొత్తగా రిసార్ట్స్ రాజకీయాలను ఈ దేశానికి పరిచయం చేసిన అమిత్ షా ఎక్కడ అని కూడా నిలదీస్తున్నారు.

పటేల్ చరిత్రలో నిలిచిన వారు, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన వారిగా చరిత్రలో పదిలంగా తన పేరుని సార్ధకం చేసుకున్న వారు. ఆయనతో అమిత్ షాకు పోలిక పెట్టడం కంటే అతి పెద్ద తప్పు వేరేది ఉంటుందా అని అంటున్నారు. ఈ దేశంలో బీజేపీ ఏలుబడి అది కూడా నరేంద్ర మోడీ అమిత్ షాల నేతౄత్వంలో ఎనిమిదేళ్ళ జమానాలో అనేక విపక్ష ప్రభుత్వాలు నేల‌రాలాయి. అమిత్ షా మంత్రాంగానికి ప్రజాస్వామికంగా ఎన్నికైన సర్కార్లు బలి అయ్యాయి.

ఇలా ఒకటి రెండు కాదు చాలా ఉదాహరణలు కళ్ళ ముందు కనిపిస్తున్న వేళ తమ రాజకీయ సామ్రాజ్య విస్తరణకు దేశంలోని విపక్షం అన్నదే ఉండకూడదు అన్న అహంకారాన్ని కలిపి దూకుడు చేస్తున్న బీజేపీ నేతలకు సర్దార్ తో పోలిక అన్నది అసలు కుదిరే పని కాదు అనే అంతా అంటున్నారు. సర్దార్ స్థానం ఈ దేశం గుండెల్లో ఎక్కడో చాలా ఎత్తున‌ ఉంది. ఆయనతో రాజకీయమే పరమావధిగా పనిచేసే వారిని, అధికారమే తమ జన్మ హక్కుగా ఆరాటపడేవారికి పోలిక తెచ్చి ఆ సర్దార్ కి ఆత్మ శాంతి లేకుండా చేయవద్దని కూడా జాతిజనులు కోరుకుంటున్నారు. కిషన్ రెడ్డి లాంటి కేంద్ర మంత్రులు ఈ తరహా పోలికలు తేవడం ద్వారా చరిత్రకు కొత్త అర్ధాలు చెబుతూ తమను తాము బాగా తగ్గించుకుంటున్నారు అన్న భావన కూడా వ్యక్తం చేస్తున్నారు.

-- - వి. ఎస్ ఆర్ కే

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.