Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేగా ఓడిపోతే కేంద్ర‌మంత్రి కావొచ్చా?

By:  Tupaki Desk   |   31 May 2019 5:02 AM GMT
ఎమ్మెల్యేగా ఓడిపోతే కేంద్ర‌మంత్రి కావొచ్చా?
X
ఈ ప్ర‌పంచంలో చాలామంది మొన‌గాళ్లు ఉండొచ్చు. చివ‌ర‌కు జేమ్స్ బాండ్‌.. సూప‌ర్ మ్యాన్.. ప‌వ‌ర్ మ్యాన్.. ఇలా చెప్పుకుంటూ కాల్పనిక క‌థ‌ల్లో కావొచ్చు.. రియ‌ల్ లైఫ్ లో కావొచ్చు.. ప్ర‌పంచాన్ని ప్ర‌భావితం చేసే వారంతా కూడా కాలం ముందు మాత్రం వారు చాలా చాలా చిన్న వాళ్లు. ఎంతో శ‌క్తివంతుల త‌ల‌రాతల్ని కాలం ఒక్క‌టి మాత్ర‌మే మార్చేయ‌గ‌ల‌దు.

తిరుగులేని ప‌వ‌ర్ తో హ‌డావుడి చేసే వారు సైతం కాలం పుణ్య‌మా అని.. ఎవ‌రూ ప‌ట్టించుకోని ప‌రిస్థితిలోకి వెళ్లిపోవ‌చ్చు. అంతేనా.. అదే కాలం త‌లుచుకుంటే.. ఎమ్మెల్యేగా ఓడిన నేత.. ఏకంగా కేంద్ర‌మంత్రి చేప‌ట్టే అదృష్ట‌వంతుడిగా మారిపోవ‌చ్చు. తాజాగా కొలువుతీరిన మోడీ కేబినెట్ లో ఇలాంటి సిత్ర‌మే క‌నిపిస్తుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోని అంబ‌ర్ పేట అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన కిష‌న్ రెడ్డి గెలుపు ఖాయ‌మ‌ని తేల్చారు. కానీ.. ఎన్నిక‌ల ఫ‌లితం అనూహ్యంగా వ‌చ్చింది. వ‌రుస‌గా మూడుసార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన ఆయ‌న‌.. తాజా ఎన్నిక‌ల్లో కాలేరు వెంక‌టేశ్ అనే ఒక కార్ప‌రేట‌ర్ చేతిలో ఓట‌మిపాల‌య్యారు.

ఈ ఓట‌మి కిష‌న్ రెడ్డికి మాత్ర‌మే కాదు.. చాలామందిని షాక్ కు గురి చేసింది. పెద్ద‌గా ప్ర‌చారం చేయ‌ని కాలేరు వెంక‌టేశ్ ఎమ్మెల్యే కావ‌టం ఏమిటి? మంచి వ‌క్త‌గా.. వ‌ర్కర్ గా.. వివాద‌ర‌హితుడిగా ఉండే కిష‌న్ రెడ్డి ఓడిపోవ‌టం ఏమిట‌న్న మాట ప‌లువురి నోట వినిపించింది. ఒక‌టి ద‌క్క‌లేదంటే.. మ‌రేదో ద‌క్కేందుకే అన్న సూత్రానికి త‌గ్గ‌ట్లే.. ఎమ్మెల్యే ఎన్నిక‌ల బ‌రిలో కిష‌న్ రెడ్డి ఓడిపోవ‌టం.. ఆయ‌న రాజ‌కీయ జీవితాన్ని మార్చే అవ‌కాశాన్ని ఇచ్చింద‌ని చెప్పాలి.

తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి బ‌ల‌మైన అభ్య‌ర్థి ఎవ‌ర‌న్నది చూసిన‌ప్పుడు కిష‌న్ రెడ్డి మిన‌హా బీజేపీకి మ‌రెవ‌రూ కనిపించ‌ని ప‌రిస్థితి. దీంతో.. ఆయ‌న్నే క‌న్ఫ‌ర్మ్ చేశారు. దేశం మొత్త‌మ్మీదా వీచిన మోడీ సానుకూల ప‌వ‌నాల నేప‌థ్యంలో ప్ర‌తికూల‌తల్ని అధిగ‌మించి మ‌రీ కిషన్ రెడ్డి విజ‌యాన్ని సాధించారు. ఎమ్మెల్యేగా ఓడిన కిష‌న్ నాలుగు నెల‌లు తిరిగేస‌రికి ఎంపీ కావ‌ట‌మే కాదు.. మోడీకి ద‌గ్గ‌ర‌న్న ట్యాగ్ తో ఆయ‌న‌కు కేంద్ర‌మంత్రి ప‌ద‌వి వ‌రించింది. ఒక వైఫ‌ల్యం.. మ‌రో విజ‌యానికి సోపానం అన‌టానికి కిష‌న్ రెడ్డి ఉదంతం ఒక చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌గా మారుతుంద‌న‌టంలో సందేహం లేదు. విజ‌యానికి ఎగిరిప‌డ‌టం.. వైఫ‌ల్యానికి కుంగిపోవ‌టం లాంటివి చేయ‌కుండా.. చేయాల్సిన ప‌ని చేసుకుంటూ పోతే.. విజ‌యం దానంత‌ట అదే వ‌స్తుంద‌న్న దానికి కిష‌న్ రెడ్డి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా మార‌తార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.