Begin typing your search above and press return to search.

కేటీఆర్ కు రూ.లక్ష సవాలు విసిరిన కిషన్ రెడ్డి

By:  Tupaki Desk   |   9 Nov 2020 6:00 AM GMT
కేటీఆర్ కు రూ.లక్ష సవాలు విసిరిన కిషన్ రెడ్డి
X
రాజకీయాలు అన్నాక సవాళ్లు.. ప్రతి సవాళ్లు చాలా సహజం. తెలంగాణలో ఇలాంటి సవాళ్లతో రాజకీయ వాతావరణం వేడెక్కిపోతుంటుంది. ఎక్కడిదాకానో ఎందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన కరీంనగర్ ఉప ఎన్నిక కూడా సవాలుతోనే మొదలైందని చెప్పాలి. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి హరీశ్ నోటి వెంట వచ్చిన దుబ్బాక పాత బస్టాండ్ కు వస్తారా? అంటూ విసిరిన సవాలుకు బీజేపీ ఎంతలా స్పందించిందో.. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలకు అదెంత తలనొప్పిగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

గడిచిన కొద్దిరోజులుగా భారీ వర్షాల కారణంగా దెబ్బ తిన్న హైదరాబాద్ కు ఒక్క పైసా కూడా ఇవ్వటం లేదని మంత్రి కేటీఆర్ అదే పనిగా బీజేపీ నేతలపై ఫైర్ కావటం తెలిసిందేన కేటీఆర్ మాటకు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి భారీ కౌంటర్ ఇచ్చారు. జాతీయ విపత్తు కింద రాష్ట్రానికి రూ.224 కోట్లు.. రహదారుల మరమ్మతులకు రూ.202 కోట్లు కేంద్రం కేటాయించినా.. కేంద్రం పట్టించుకోవటం లేదని అదే పనిగా విమర్శలు చేస్తున్నారన్నారు.

మరి.. దీనిపై కేటీఆర్ ఏం బదులిస్తారోచూడాలి. కిషన్ రెడ్డి చెప్పినట్లుగా కేంద్రం దగ్గర దగ్గర రూ.424 కోట్లు ఇచ్చినప్పుడు.. ఆ విషయాన్ని ఆయన ఎందుకు ప్రస్తావించటం లేదన్నది ప్రశ్న. ఇదిలా ఉంటే.. గుంత ఉన్న రోడ్డు చూపిస్తే.. ప్రతి గుంతకు రూ.వెయ్యి చొప్పున ఇస్తానని కేటీఆర్ చెప్పారని.. హైదరాబాద్ మహానగరంలో గుంతలు లేని రోడ్డుచూపిస్తే తాను రూ.లక్ష ఇస్తానని సవాలు విసిరారు. టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి విసిరిన సవాలుకు ఆయనెలా స్పందిస్తారో చూడాలి.