Begin typing your search above and press return to search.

టీడీపీకి ఊహించ‌ని షాక్ ఇచ్చిన మిత్ర‌పక్షం

By:  Tupaki Desk   |   22 April 2016 9:55 AM GMT
టీడీపీకి ఊహించ‌ని షాక్ ఇచ్చిన మిత్ర‌పక్షం
X
బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ప‌ద‌వీ కాలం ముగిసి కొత్త అధ్య‌క్షుడిగా డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ ప్ర‌మాణ‌స్వీకారం చేసిన సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన కిష‌న్‌రెడ్డి ఏక‌కాలంలో సొంత పార్టీ అయిన బీజేపీని, మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీని చిక్కుల్లో ప‌డేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వల్లే నష్టపోయామని కిష‌న్‌ రెడ్డి చెప్పారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా పొత్తు వద్దని అప్పుడే అధిష్ఠానానికి చెప్పానని కిష‌న్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ స్థానిక నేతల అభిప్రాయానికి వ్యతిరేకంగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని బీజేపీ అగ్ర‌నేత‌ల‌పై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అయితే సొంతంగా మెజార్టీ స్థానాల్లో గెలిచే ప‌రిస్థితులు లేవ‌న్నారు. ఇక త‌న‌కు బీజేపీ శాస‌న‌స‌భా నేత ప‌ద‌వి తిరిగి ద‌క్క‌డం గురించి మాట్లాడుతూ బీజేఎల్పీ నేతగా కొత్తవారికి అవకాశం ఇస్తే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో బీజేఎల్పీ నేతగా పదేళ్లు పనిచేశానని గుర్తు చేశారు. తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతం అవ‌డానికి అవ‌కాశాలు ఉన్న‌ప్ప‌టికీ కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని వ్యాఖ్యానించారు.