Begin typing your search above and press return to search.

ఏపీ రాజధాని వ్యవహారం.. కిషన్‌ రెడ్డి హాట్‌ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   17 Oct 2022 8:38 AM GMT
ఏపీ రాజధాని వ్యవహారం.. కిషన్‌ రెడ్డి హాట్‌ కామెంట్స్‌!
X
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని వ్యవహారంపై కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉంటుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుందన్నారు. అమరావతే ఏపీ రాజధాని ప్రధాని మోడీ చెప్పారన్నారు. అమరావతికే బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఎవరు ఏం చెప్పినా, ఏం చేసినా ఏపీ రాజధాని మారే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు.

ఏలూరు, గుంటూరు జిల్లాల్లో పర్యటన కోసం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమానంలో హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. ఆయనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిషన్‌ రెడ్డి విశాఖపట్నంలో జనసేన నాయకులను, కార్యకర్తలను అరెస్ట్‌ వ్యవహారంపై స్పందించారు. రాజకీయాల్లో ఎక్కడైనా కక్ష సాధింపు చర్యలు అనేది సరి కాదన్నారు. రాజకీయ పార్టీలు తమ తమ కార్యక్రమాలు చేసుకోవాలని... అంతే కానీ కక్ష సాధింపు చర్యలు ఉండకూడదని హితవు పలికారు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి అదే చెబుతోందని తెలిపారు. అమరావతిలో సంవత్సరం నుండి ధర్నా చేసిన రైతులకు న్యాయం చేశామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

అటు ఇతర రాజకీయ పార్టీ కార్యక్రమం చేస్తున్నప్పుడు అధికార పార్టీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ కార్యక్రమాలను నిర్వహించుకునే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుందని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

ఈ సందర్భంగా మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రధాని మోదీ వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టారని చెప్పారు. వ్యవసాయదారులకు తక్కువ ధరకే ఎరువులు, విత్తనాలు అందించే ప్రయత్నం చేస్తున్నారని ప్రశంసించారు. రైతులు మూస పద్దతిలో వేసిన పంట మళ్లీ మళ్లీ వేయడంతో గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. ఈ నేపథ్యంలో పంట మార్చి వేస్తే మరింత లాభాలు వస్తాయని అభిప్రాయపడ్డారు.

కరోనా సమయంలోనూ రైతులు ఇంట్లో కూర్చోకుండా పంట పండించారని.. అందరికంటే రైతులు మిన్న అని కిషన్‌రెడ్డి కొనియాడారు. దేశంలో ఎక్కడ ఎరువుల కొరత లేకుండా ప్రధాని మోదీ చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.