Begin typing your search above and press return to search.

కిషన్ రెడ్డి లెక్కలు తీసి మరీ..బాబును ఏకేశారు

By:  Tupaki Desk   |   23 Jun 2019 4:32 PM GMT
కిషన్ రెడ్డి లెక్కలు తీసి మరీ..బాబును ఏకేశారు
X
రాజ్యసభలో టీడీపీకి తగిలిన షాక్ పై ఆ పార్టీ నేతలు చాలానే మాట్లాడుతున్నారు. తమ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలో చేరిపోయిన వైనం ముమ్మాటికీ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకే వస్తుందని వాదిస్తున్న టీడీపీ నేతలు... తమదైన శైలిలో బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి క్రమంలో టీడీపీ వాదనకు కౌంటర్ ఇచ్చేందుకు ఆదివారం ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చిన బీజేపీ సీనియర్ నేత - కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి... టీడీపీ నేతలను - ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు పార్టీ ఫిరాయింపులపై టీడీపీకి గానీ - చంద్రబాబుకు గానీ - ఆ పార్టీ నేతలకు గానీ కనీసం మాట్లాడే అర్హత కూడా లేదంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

బీజేపీలోకి చేరిన నలుగురు ఎంపీలు తమ పార్టీకి రాజీనామాలు చేసిన తర్వాతే బీజేపీలో చేరారని గుర్తు చేసిన కిషన్ రెడ్డి... ఈ చేరికలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి లోబడే జరిగాయని కూడా చెప్పారు. అయినా చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ఏ ప్రాతిపదికన టీడీపీలో చేర్చుకున్నారో చెప్పాలని కూడా కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధంగానే టీడీపీలో చేర్చుకున్నారని తేల్చి చెప్పారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడిచేలా 23 మంది విపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు... వారిలో ఓ నలుగురికి ఏకంగా మంత్రి పదవులు ఇచ్చిన వైనాన్ని ప్రస్తావించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను నిబంధనలకు విరుద్ధంగా పార్టీలో చేర్చుకోవడంతో పాటుగా వారికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టిన చంద్రబాబుకు... ఇప్పుడు నిబంధనలకు అనుగుణంగానే టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరిన వైనంపై అసలు విమర్శించే అర్హతే లేదన్నారు.

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన టీడీపీ... ఇతర పార్టీలను విమర్శించే హక్కు ఎప్పుడో కోల్పోయిందని కూడా కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ టికెట్లపై గెలిచిన 23 మందిని తనలో చేర్చుకుని వారికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టిన నీచ చరిత్ర టీడీపీదని కూడా కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇలాంటి చరిత్ర ఉన్న టీడీపీ - ఆ పార్టీ అధినేత - ఇతర నేతలు ఇతర పార్టీల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగానే ఉందని కూడా కిషన్ రెడ్డి చెప్పారు. మొత్తంగా పార్టీ ఫిరాయింపులపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు వచ్చిన కిషన్ రెడ్డి... మొత్తంగా టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును తనదైన శైలిలో ఏకిపారేశారని చెప్పాలి.