Begin typing your search above and press return to search.

దేవుడు ఆపలేని అసంతృప్తిని సారు ఆపగలరా?

By:  Tupaki Desk   |   14 Sep 2019 7:03 AM GMT
దేవుడు ఆపలేని అసంతృప్తిని సారు ఆపగలరా?
X
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గులాబీ బాస్ కు టెన్షన్ పెట్టే మాటల్ని ఆయన చెప్పారు. మామూలు రోజుల్లో అయితే.. ఇలాంటి వ్యాఖ్యల్ని సీఎం కేసీఆర్ పెద్దగా పట్టించుకునే వారు కాదేమో? కానీ.. కొద్ది రోజులుగా టీఆర్ఎస్ పార్టీలోచోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆయన ఆందోళనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

దీనికి బలం చేకూర్చేలా తాజాగా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు గులాబీ నేతలకు గుబులు పుట్టించేలా ఉన్నాయి. టీఆర్ ఎస్ లో తలెత్తిన అసంతృప్తిని భగవంతుడు కూడా ఆపలేడని.. లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో ప్రజల నుంచి వెల్లడైన వ్యతిరేకత ఇప్పుడు పార్టీ నేతల్లోనూ బయటపడుతుందంటున్నారు. పార్టీ నాయకత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ.. ఒకరి తర్వాత మరొకరు బయటపడుతున్నారని.. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

బీజేపీ.. టీఆర్ ఎస్ లది ఢిల్లీలో దోస్త్ అన్న రేవంత్ మాటలు పనికిరాని ముచ్చటగా తేల్చేశారు. టీఆర్ఎస్ - మజ్లిస్ దోస్తీ.. ఓవైసీ.. కల్వకుంట్ల కుటుంబాలు తెలంగాణ మీద చేస్తున్న పెత్తనంతో కాంగ్రెస్ కుంచించుకుపోవటం.. మోడీ మీద పెరుగుతున్న ఆదరణ అన్ని బీజేపీకే లాభం చేకూరేలా చేస్తాయన్నారు.

తెలంగాణలో ఆపరేషన్ కమల్ లేదని.. కేవలం డెడికేషన్ మాత్రమే ఉందన్నారు. ఆపరేషన్ చేస్తే పార్టీ అధికారంలోకి రాదని.. తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది గ్రామీణులు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సమరయోధుల్ని సన్మానం చేస్తున్నామని...తాము రాజకీయం చేయట్లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

మజ్లిస్ కు కొమ్మకాసే ఏ పార్టీ కూడా సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహించటం లేదన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. బీజేపీ మాత్రమే దీన్ని చేస్తుందని స్పష్టం చేశారు. సెప్టెంబరు 17న అధికారికంగా నిర్వహించాలని తాము 1996 నుంచి పోరాటం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.