Begin typing your search above and press return to search.

కిషన్ రెడ్డి అలాంటి కల కంటున్నారా?

By:  Tupaki Desk   |   7 April 2016 4:48 AM GMT
కిషన్ రెడ్డి అలాంటి కల కంటున్నారా?
X
ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లుగా ఉంది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాటల్ని చూస్తుంటే. ఏం చూసుకొని ఆయన అంతటి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారో అర్థం కాక తెలంగాణ కమలనాథులు సైతం విస్మయం చెందుతున్నారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ తీరును.. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టిన కిషన్ రెడ్డి చెప్పిన మాటలు ఎవరూ పెద్దగా నోట్ చేసుకోలేదు కానీ.. ఆయన ఇచ్చిన ఒక స్టేట్ మెంట్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏం చూసుకొని కిషన్ రెడ్డికి అంత ఆత్మవిశ్వాసం అన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో పట్టుమని ఐదుసీట్లను సంపాదించుకోలేని బీజేపీ.. 2019 అసెంబ్ ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సర్కారు కొలువు తీరుతుందని వ్యాఖ్యానించారు.

ఈ మధ్య కాలంలో తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలు కానీ.. స్థానిక ఎన్నికల్లోకానీ ఏ మాత్రం ప్రభావాన్ని చూపించలేని బీజేపీని.. 2019 ఎన్నికల్లో విన్నింగ్ పార్టీ అంటూ కిషన్ రెడ్డి అభివర్ణన జనాల దాకా కాదు.. పార్టీలోనే ఆశ్చర్యకరంగా మారింది. అధికారం దాకా ఎందుకు..? విపక్షం అనిపించుకోవటానికి అవకాశం ఉన్న సీట్లను సంపాదించుకున్నా గొప్పేనని చెప్పక తప్పదు. ప్రచారం కోసం ఇలాంటి మాటలు చెబితే.. ప్రజల్లో చులకన కారా అన్నది కిషన్ రెడ్డి ఆలోచించుకుంటే బాగుంటుంది.