Begin typing your search above and press return to search.

బార్ - బీర్ - బేకార్ టీఆర్ ఎస్ గవర్నమెంట్

By:  Tupaki Desk   |   2 April 2019 5:50 AM GMT
బార్ - బీర్ - బేకార్ టీఆర్ ఎస్ గవర్నమెంట్
X
సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి - మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి టీఆర్ ఎస్ పై పరుష పదాలతో విరుచుకుపడ్డారు. మద్యం అమ్మకాలను పెంచి ఆదాయాన్ని కొల్లగొడుతున్న టీఆర్ ఎస్ సర్కారును ఉద్దేశించి ‘బార్ - బీర్ - బేకార్ టీఆర్ ఎస్ గవర్న్ మెంట్’ అంటూ కామెంట్ చేశారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రచారానికి రాగా..ఆ సభలో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి మాట్లాడారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి టీఆర్ ఎస్ ను ఎండగట్టారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో విద్యావంతులు టీఆర్ ఎస్ ను తిరస్కరించి ఓడించారని గుర్తు చేశారు. ‘టీఆర్ ఎస్ కు మీరు ఒకవేళ ఓటిస్తే అది బేకార్ సర్కార్ కు వేసినట్టే.. సీఎం కేసీఆర్ కేవలం తన కుటుంబానికి లబ్ధి చేకూర్చడానికే పనిచేస్తున్నాడు.తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోకుండా ఢిల్లీకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు’ అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

ఇక కేటీఆర్ ‘సారు.. కారు.. పదహారు.. ఢిల్లీ సర్కారు’ స్లోగన్ పై కూడా కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో 16 సీట్లు మొత్తంగా గెలుస్తామని ఊహించుకుంటున్నారని.. అది కల్ల అని అన్నారు. వారు ఏం అభివృద్ధి చేశారని.. ఈ ఐదేళ్లలో టీఆర్ ఎస్ ఎంపీ ఏం ఒరగబెట్టలేదని దెప్పిపొడిచారు. టీఆర్ఎస్ కు ఓటేస్తే అది వృథా అయినట్టేనని కిషన్ రెడ్డి ప్రజలకు వివరించారు.