Begin typing your search above and press return to search.

అసద్ ఎంపీ పదవిని రద్దు చేయమంటున్నాడు

By:  Tupaki Desk   |   6 July 2016 9:16 AM GMT
అసద్ ఎంపీ పదవిని రద్దు చేయమంటున్నాడు
X
ఎలాంటి వ్యాఖ్యాల్ని అయినా వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడటం మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి అలవాటన్న విమర్శ ఉంది. మాటలే కాదు.. ఆయన చేతలు సైతం ఇప్పటికే పలుమార్లు వివాదాస్పదం అయ్యాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మంట పుట్టిస్తున్నాయి. ఐఎస్ ఉగ్రవాదుల సానుభూతి పరులు హైదరాబాద్ లో విధ్వంసాన్ని సృష్టించేందుకు ప్లాన్ చేయటం.. భారీ విధ్వంసానికి పన్నిన కుట్రను అమలు చేయటానికి మూడు.. నాలుగు రోజుల ముందు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు.. తెలంగాణ పోలీసులు కలిసి వారిని అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.

తాము నగరంలో పెద్ద ఎత్తున విధ్వంసానికి ప్లాన్ చేసిన విషయాన్ని చెప్పటంతో పాటు.. వారు ఎక్కడెక్కడ ఏమేం చేయాలనుకున్న విషయాన్ని.. తమ కుట్రను వారు పూసగుచ్చినట్లుగా చెబుతుంటే.. మరోవైపు వారికి అవసరమైన న్యాయసాయం అందిస్తామని.. నిందితులకు న్యాయసహాయం అందించటం తప్పు లేదంటూ ఎంపీ అసద్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

ఆయన వ్యాఖ్యలు సరికావని పలువురు తప్పు పడుతున్నా.. విమర్శలు చేస్తున్నా పట్టించుకోని అసద్.. తాము చేసేది తప్పు కాదన్నట్లే మాట్లాడుతున్నరు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి తాజాగా స్పందించారు. ఉగ్రవాదులకు సాయం చేయాలని చెబుతున్న అసద్ తీరును తప్పు పట్టారు. ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బాధ్యతాయుతమైన ఎంపీగా ఉంటూ.. ఉగ్రవాదులకు అనుకూలంగా ఎలా ప్రకటన చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఓవైసీ మాటలు ఉగ్రవాదులకు మద్దతు పలికేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. మరి.. కిషన్ రెడ్డి చేసిన తాజా వాదనపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.