Begin typing your search above and press return to search.

నాడు ఎన్టీఆర్ ను..నేడు ఆయన సిద్ధాంతాలను..

By:  Tupaki Desk   |   9 Sep 2018 8:07 AM GMT
నాడు ఎన్టీఆర్ ను..నేడు ఆయన సిద్ధాంతాలను..
X
స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు ఎంత నీచస్థాయికైనా దిగజారుతారని బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంనేందుకు ఢిల్లీకి వచ్చిన కిష్ రెడ్డి చంద్రబాబు.. కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోబోతుండడంపై నిప్పులు చెరిగారు. నాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను మానసిక క్షోభకు గురిచేసి ఆయన మరణానికి కారణమయ్యారని.. ఇప్పుడు ఆయన సిద్ధాంతాలను కూడా కనుమరుగు చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే.. ఇప్పుడు అదే కాంగ్రెస్ తో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాడు ఇందిరగాంధీ కుట్రలకు ఎన్టీఆర్ ప్రభుత్వం అస్థిరపడితే బీజేపీ బాసటగా నిలిచిందని.. తాను ఆందోళనలు చేసి జైలుకు కూడా వెళ్లానని కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీకి నాడు బీజేపీ మద్దతు ఇచ్చిందని.. ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే తెలుగు ప్రజలు చూస్తూ ఊరుకోరని కిషన్ రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటే మంచిదని హితవు పలికారు.

ఇక కర్ణాటకలో వలే తాను కూడా తెలంగాణలో సీఎం అవుతానని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. నిజాం నిరంకుశపాలనను ఆయన తిరిగి తెలంగాణలో తీసుకురావాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. అసెంబ్లీపై రజాకర్ల జెండా ఎగురవేస్తామని చెప్పే ధైర్యం ఎంఐఎంకు వచ్చిందంటే దానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే కారణమన్నారు. మజ్లిస్ తో వెళ్తున్న టీఆర్ఎస్ తో బీజేపీకి ఎలాంటి పొత్తులుండవని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.