Begin typing your search above and press return to search.

అవును.. మేం కుక్క‌ల‌మే.. మ‌రి మీరు..?

By:  Tupaki Desk   |   6 May 2017 6:11 AM GMT
అవును.. మేం కుక్క‌ల‌మే.. మ‌రి మీరు..?
X
తెలంగాణ అధికార‌ప‌క్షానికి.. విప‌క్ష బీజేపీకి మ‌ధ్య మిర్చి మాట‌ల మంట అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. ఓప‌క్క ప‌డిపోతున్న మిర్చి ధ‌ర‌పై మండిప‌డుతున్న రైతుల ఆగ్ర‌హానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ అధికార‌ప‌క్షం.. రైతుల వెత‌ల్ని తీర్చేందుకు కేంద్రం స్పంద‌న అంతంత‌మాత్రంగా ఉందంటూ తెలంగాణ అధికార‌ప‌క్ష నేత‌లు మండిప‌డుతున్నారు. మిర్చి పంట కొనుగోలు విష‌యంలో కేంద్రం వైఖ‌రిని తెలంగాణ రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు తీవ్ర‌స్తాయిలో విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే.

హ‌రీశ్ వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ బీజేపీ మండిప‌డుతున్నారు. కేంద్రం చేయ‌ని త‌ప్పును చేశారంటూ అవాస్త‌వాల్ని చెబుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు. దొంగ‌లు ప‌డ్డ ఆరు నెల‌ల‌కు కుక్క‌లు మొరిగిన‌ట్లుగా ధ‌ర ప్ర‌క‌టించారంటూ హ‌రీశ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించిన తెలంగాణ బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత కిష‌న్ రెడ్డి ఫైర్ అవుతూ.. కుక్క‌ల‌కు విశ్వాసం ఉన్న‌ట్లే త‌మ‌కూ ఉంద‌ని.. తాము కుక్క‌ల‌మేన‌ని.. మ‌రి మీరో (టీఆర్ ఎస్ నేత‌ల్ని ఉద్దేశించి) అంటూ ప్ర‌శ్నించారు.

ప్ర‌తిప‌క్షాల కుట్ర కార‌ణంగానే ఖ‌మ్మం మార్కెట్ పై దాడి జ‌రిగింద‌ని చెప్ప‌టం ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించ‌ట‌మేన‌న్న ఆయ‌న‌.. నిజామాబాద్ జిల్లాలో ఈ-నామ్ సాధించిన విజ‌యానికి నిద‌ర్శ‌నంగా ప్ర‌ధాని మోడీ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నార‌ని.. మ‌రి అదే ఈ-నామ్ కార్యాల‌యంపై ఖ‌మ్మంలో మాత్రం దాడి ఎందుకు జ‌రిగిదంటూ ప్ర‌శ్నించారు. మిర్చి రైతుల ఇష్యూపై కేంద్రాన్ని విమ‌ర్శిస్తున్న హ‌రీశ్ రావు తీరును త‌ప్పు ప‌ట్టిన కిష‌న్ రెడ్డి..కేంద్రంపై విమ‌ర్శ‌లు చేస్తున్న సీఎం కుటుంబ స‌భ్యుల తీరును త‌ప్పు ప‌ట్టారు. వారి వ్యాఖ్య‌ల్ని వారి విజ్ఞతకే వ‌దిలేస్తున్న‌ట్లుగా వ్యాఖ్యానించారు.

మంత్రి హ‌రీశ్ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ అధికార ప్ర‌తినిధి కృష్ణ‌సాగ‌ర్ రావు తీవ్ర‌స్థాయిలో ద్వ‌జ‌మెత్తారు. హ‌రీశ్ చెప్పిన లెక్క‌ల‌న్నీ త‌ప్పుల త‌డ‌క‌గా ఉన్న‌ట్లుగా చెప్పిన ఆయ‌న‌.. కేంద్రంపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని.. కేంద్రం ఎఫ్ ఏ క్యూ ర‌కం మిర్చిని మాత్ర‌మే కొనుగోలు చేస్తుంద‌ని చెప్ప‌లేద‌ని.. ఆ పేరుతో హ‌రీశ్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న‌ట్లుగా ఆరోపించారు. అవ‌గాహ‌న లేకుండా కేంద్రంపై వ్యాఖ్య‌లు చేసిన హ‌రీశ్ భేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/