Begin typing your search above and press return to search.

కేసీఆర్ వ‌ల్ల దేశం పరువు పోయింది

By:  Tupaki Desk   |   22 Dec 2017 8:35 AM GMT
కేసీఆర్ వ‌ల్ల దేశం పరువు పోయింది
X
ఔను. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌ల్ల దేశం ప‌రువుపోయింద‌ట‌. ఇంతేకాకుండా సాక్షాత్తు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తెలంగాణ‌కు రావాల‌ని భావిస్తే...దానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అడ్డుప‌డ్డార‌ట‌. ఎవ‌రు ఈ స్థాయిలో మండిపడింది అంటే...బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి. ప్ర‌త్యేకంగా విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి మ‌రీ ఈ విష‌యాన్ని ఆరోపించారు. అదేంటి ఇటీవ‌లి కాలంలో ప్ర‌ధాని మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్ స‌ఖ్య‌త‌తోనే ఉంటున్నారు క‌దా? అనే సందేహం మీకు రావ‌చ్చు. అయితే దానికి కిష‌న్ రెడ్డి చెప్పే లాజిక్ వేరేగా ఉంది.

వ‌చ్చే ఏడాది జనవరి 3 నుండి 7 వరకు ఉస్మానియా యూనివ‌ర్సిటీ వేదిక‌గా జరగవలసిన సైన్స్ కాంగ్రెస్ వాయిదా పడిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామం ప‌లువర్గాల‌ను ఆశ్చ‌ర్యంలో ప‌డేసింది. అయితే దీనిపై కిష‌న్ రెడ్డి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం - ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై మండిప‌డ్డారు. ఈ స‌భ‌లు వాయిదా ప‌డటాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంద‌ని తెలిపారు. గత సంవత్సరం తిరుపతిలో ఏపీ ప్రభుత్వం ఘనంగా సైన్స్ కాంగ్రెస్ నిర్వహించారని గుర్తు చేశారు. ఈ సమావేశాలకు ప్రధాని రావడం ఆనవాయితీ అని పేర్కొంటూ టీఆర్ ఎస్ ప్రభుత్వం ఒత్తిడి వల్లే హైద‌రాబాద్‌ లో జ‌ర‌గ‌వ‌ల్సిన‌ సమావేశాలను వాయిదా వేశారని కిష‌న్ రెడ్డి ఆరోపించారు. త‌ద్వారా ప్ర‌ధానిని రాష్ట్రంలో అడుగుపెట్ట‌కుండా చేశార‌ని మండిప‌డ్డారు.

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న సైన్స్ కాంగ్రెస్‌కు ఇప్ప‌టికే 62 దేశాలకు సంబందించిన వారు పేర్లను నమోదు చేసుకున్నారని, 7 గురు నోబెల్ బహుమతులు పొందిన వారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కిష‌న్ రెడ్డి తెలిపారు. ఈ స‌మావేశం కోసం వచ్చే వారికి హోటల్స్ - కార్స్ - విమాన టికెట్స్ కూడా బుక్ చేసి ఇలా..సైన్స్ కాంగ్రెస్ మీటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారని కిష‌న్ రెడ్డి వెల్ల‌డించారు. ప్రతినిధుల నుండి రిజిస్ట్రేషన్ ఫీ కూడా తీసుకున్నారని...కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టారని తెలిపారు. అయిన‌ప్ప‌టికీ అర్ధాంతరంగా వాయిదా వేయించి ఓయూ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించిందని కిష‌న్ రెడ్డి మండిప‌డ్డారు. ప్రభుత్వం ఏకపక్ష వైఖరిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంద‌ని తెలిపారు. దేశ - రాష్ర్ట ప్రతిష్టను కూడా ప్రభుత్వం దెబ్బతీసేవిధంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

సీఎం కేసీఆర్‌ కు ఉస్మానియా యూనివ‌ర్సిటీ అంటే ఇష్టం లేదు కాబట్టే సభలను వాయిదా వేశారని కిష‌న్ రెడ్డి మండిప‌డ్డారు. ఇలాంటి సభలు నిర్వహించక పోవడం తెలంగాణకు అవమానక‌ర‌మ‌ని అన్నారు. ఓయూకు చెడ్డ పేరు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమ‌ర్శించారు. ద్వేషాపురితంగానే ఓయూలో జరిగే సైన్స్ కాంగ్రెస్ ను సీఎం కేసీఆర్ వాయిదా వేశారని పున‌రుద్ఘాటిస్తూ....వాయిదాను ప్రభుత్వం పునర్ఆలోచన చేయాలని కోరారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా బీజేపీ విద్యార్థులతో మాట్లాడుతుందని స‌భ‌లు జ‌రిగేందుకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని కోరారు.