Begin typing your search above and press return to search.

కిషన్ రెడ్డికి కోపమొచ్చింది.. దీదీని దులిపేశారుగా?

By:  Tupaki Desk   |   20 Dec 2019 2:30 PM GMT
కిషన్ రెడ్డికి కోపమొచ్చింది.. దీదీని దులిపేశారుగా?
X
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి తాజాగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ లోకల్ వ్యాఖ్యలే తప్పించి.. జాతీయ స్థాయిలో విమర్శలు చేయటం.. కీలక నేతల మీదా.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద మండిపడటం లాంటివి చేయలేదు. అందుకుభిన్నంగా తాజాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీద ఆయన ఆగ్రహం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మోడీ సర్కారు ఇటీవల చట్టం చేసిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా నిరసనలు.. ఆందోళనలు వ్యక్తం కావటం తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో ఈ అంశం మీద ఆగ్రహజ్వాలలు చెలరేగుతున్నాయి. గురువారం చోటు చేసుకున్న నిరసనల్ని అదుపు చేసే క్రమంలో ముగ్గురు పోలీసుల తూటాలకు బలి కావటంతో ఈ వ్యవహారం మరింత సీరియస్ గా మారింది.

పౌరసత్వ చట్టం మీద దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్న నిరసనలకు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ఈ రోజు బీజేపీకి చెందిన పలువురు నేతలు రంగంలోకి దిగినట్లుగా కనిపిస్తోంది. కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డికి కోపమొచ్చింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీద ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. విపక్షాలపైనా విరుచుకుపడ్డారు.

సీసీఏకు సంబంధించిన నిబంధనలు.. విధివిధానాలు పూర్తిగా ఖరారు కాలేదన్న ఆయన.. ప్రతిపక్షాలు ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. విద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నట్లుగా ఫైర్ అయ్యారు. దేశం సాధారణ పరిస్థితికి వచ్చిన తర్వాత చట్టంలోని నిబంధనలపై ప్రతిఒక్కరితో చర్చిస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హులకు మాత్రమే ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

బీజేపీకి దమ్ముంటే సీఏఏ మీద ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా వ్యాఖ్యలపై మండిపడ్డారు. తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలహీన పడటం.. ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా వీడిపోవటంతో ఆమె భయపడిపోతున్నారని.. ఈ కారణంతోనే ఆమె అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

అసలు మమత ఏం మాట్లాడుతున్నారో ఆమెకు తెలుసా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏమిటి? అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల్ని విభజించేందుకు.. తప్పుదోవ పట్టించేందుకు మతాన్ని వాడుకుంటున్నారన్నారు. విపక్షాలపై విరుచుకుపడుతూనే.. పౌరసత్వ సవరణ చట్టంపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పాలి.అయినా.. దేశానికి సంబంధించిన విషయాల మీద ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలన్న మాటలు దీదీ స్థాయికి తగ్గట్లు లేవని చెప్పక తప్పదు.