Begin typing your search above and press return to search.

భైంసాలో మజ్లిస్ మతకలహాలు..కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   15 March 2021 4:30 AM GMT
భైంసాలో మజ్లిస్ మతకలహాలు..కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా రియాక్టు అయ్యారు. భైంసాలో జరిగిన అల్లర్లపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భైంసాలో పథకం ప్రకారం మజ్లిస్ దాడులు చేస్తున్నట్లు ఆరోపించారు. అక్కడున్న మజ్లిస్ పార్టీ నాయకత్వం హిందువులపైన పెద్ద ఎత్తున దాడులు చేస్తోందని.. టీఆర్ఎస్ మద్దతుతో మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికైన వ్యక్తి.. కౌన్సిలర్లు అక్కడ భయానక వాతావరణాన్నిక్రియేట్ చేస్తున్నట్లుగా ఆరోపించారు.

కలహాలకు కారణమైన మజ్లిస్ నేతలపై కేసులు పెట్టలేదని.. పోలీసులకు అధికార పార్టీ చేతులు కట్టేసిందన్నారు. భైంసాలో వచ్చిన అనేక రకాల ఫిర్యాదుల మేరకు పూర్తి వివరాల్ని కేంద్రానికి సమర్పించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కోరనున్నట్లుగా చెప్పారు. ఆర్నెల్లలో ఇలాంటి మతకలహాలు జరగటం ఇది రెండోసారని.. ఇప్పుడు ఈ తీరు గ్రామాలకు పాకినట్లు చెప్పారు.

నాలుగేళ్ల చిన్నారిపై ఒక యువకుడు రేప్ చేస్తే నాలుగు రోజుల పాటు కేసు పెట్టకుండా ప్రభుత్వం తొక్కి పెట్టే ప్రయత్నం చేసినట్లుగా చెప్పారు. చివరకు తమ పార్టీ తరఫున బాధితుల కుటుంబ సభ్యుల్ని హైదరాబాద్ కు తీసుకొచ్చి.. గాంధీ ఆసుపత్రిలో పాపను చేర్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. లైంగిక దాడికి గురైన చిన్నారికి సంబంధించి.. నిందితుడిపై కేసు పెట్టటానికి పోలీసులు ఎందుకంత ఆలస్యం చేసినట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.