Begin typing your search above and press return to search.
మోడీకి నచ్చిన గవర్నర్ పై కిషన్ రెడ్డికి కోపమా?!
By: Tupaki Desk | 9 Aug 2018 5:30 PM GMTకాంగ్రెస్ నియమించిన గవర్నర్లలో మోడీ ప్రేమ ను పొందుతున్న ఏకైక గవర్నర్ మన తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్. దేవుడ్ని నిత్యం కొలిచే నరసింహన్ మోడీకి నమ్మిన బంటులా మారి మంచి ప్రాపకం సంపాదించారు. అయితే, తాజాగా గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ పై బీజేపీ నేత కిషన్ రెడ్డి అనూహ్య కామెంట్లు చేశారు. గవర్నర్ అధ్యక్షతన జరిగిన యూనివర్సిటీల వీసీ సమావేశంలో విశ్వవిద్యాలయాల పనితీరుపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వివిధ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. అయితే తాజాగా కిషన్ రెడ్డి కలకలం రేపే కామెంట్లు చేశారు. అసలు ఆ సమావేశంలో గవర్నర్ ఏం చూసి సంతృప్తి చెందారో అర్ధం కావడం లేదని వ్యాఖ్యలు చేవారు. దీనిపై రాజ్ భవన్ కార్యాలయం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
విశ్వవిద్యాలయాల పరిస్థితులకు - గవర్నర్ చేసిన కామెంట్లకు పొంతన లేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ``యూనివర్సిటీల్లో మెస్ లు తెరవలేదు - హాస్టళ్ల పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి - మరి గవర్నర్ ఏమి చూసి సంతృప్తి వ్యక్తం చేశారో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పాలి`` అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓయూలో ఇప్పటికీ ఒక్క ప్రొఫెసర్ కూడా లేని డిపార్ట్ మెంట్లు ఉన్నాయన్న సంగతి తెలుసోలేదోనని ఎద్దేవా చేశారు. అసలు గవర్నర్ ఏం చూసి మెచ్చుకున్నారో తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక వర్సిటీల పరిస్థితులు ఘోరంగా తయారయ్యాయన్నారు. యూనివర్సిటీల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దాదాపు 70 శాతం పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. విశ్వవిద్యాలయాల కులపతిగా గవర్నర్ ఆయా యూనివర్సిటీల్లోని పరిస్థితులను చక్కదిద్దాలని కోరారు.