Begin typing your search above and press return to search.

ఆట మొదలుకాలేదు.. మేం ఆడటం మొదలెడితే టీఆర్ఎస్ కు దిమ్మ తిరుగుడే

By:  Tupaki Desk   |   15 March 2021 2:35 AM GMT
ఆట మొదలుకాలేదు.. మేం ఆడటం మొదలెడితే టీఆర్ఎస్ కు దిమ్మ తిరుగుడే
X
ఒకప్పుడు చెలరేగిపోయినట్లుగా మాట్లాడే అలవాటున్న కిషన్ రెడ్డి.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండ్ కో విషయంలో ఆచితూచి అన్నట్లు మాట్లాడుతుంటారన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. గతంతో పోలిస్తే.. ఆయన మాటల్లో చురుకుదనం తగ్గిందన్న విమర్శ ఉంది. మిగిలిన రాజకీయ ప్రత్యర్థులతో పోలిస్తే.. గులాబీ బాస్ ను.. గులాబీ పార్టీని ఘాటుగా తిట్టే విషయంలో ఆయన అంత ఆసక్తి ప్రదర్శించరన్న ఆరోపణ ఉంది. ఇలాంటివేళ.. తన తీరుకు పూర్తి భిన్నంగా టీఆర్ఎస్ మీద నిప్పులు చెరిగిన వైనం ఆసక్తికరంగా మారింది.

కేంద్ర ప్రభుత్వం మీద తరచూ చేస్తున్న విమర్శలకు తగిన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. టీఆర్ఎస్ కు తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చేశారు. టీఆర్ఎస్ సర్కారు తానిచ్చిన హామీలు అమలు చేయకుండా కేంద్రం మీద విమర్శలు చేస్తూ పోతే చేతులుముడుచుకొని కూర్చోబోమని హెచ్చరించారు. ఆట ఇంకా మొదలు కాలేదని.. బీజేపీ పూర్తిస్థాయిలో ఆట మొదలు పెడితే టీఆర్ఎస్ కు దిమ్మ తిరుగుతుందన్నారు.

ఎన్నికల్లో లబ్థి కోసం తప్పుడు ప్రచారం చేయటం.. కేసీఆర్ కు ఆయన కుటుంబ సభ్యులకు అలవాటుగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను మోడీ అమ్మేస్తున్నారని ఆరోపిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తప్పు పట్టారు. కేసీఆర్ కుమారుడు షాడో ముఖ్యమంత్రిగా తెలంగాణ యంత్రాంగాన్ని శాసిస్తున్నారని.. ఏ రాజ్యాంగం ప్రకారం ఆయన అన్ని శాఖలపై పెత్తనం చెలాయిస్తున్నదీ ప్రజలకు చెప్పాలన్నారు. రీజనల్ రింగు రోడ్డుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేస్తే కేంద్రం వెంటనే టెండర్లు పిలిచి.. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తుందన్నారు. మరీ.. ఘాటు వ్యాఖ్యలకు గులాబీ బాస్.. చిన్న బాస్ ఏ తీరులో రియాక్టు అవుతారో చూడాలి.