Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. జగన్ కు బంపర్ ఆఫర్

By:  Tupaki Desk   |   15 March 2021 5:30 AM GMT
విశాఖ ఉక్కుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. జగన్ కు బంపర్ ఆఫర్
X
ఉక్కును అమ్ముతామంటూ కేంద్రం తేల్చి చెప్పేస్తున్న వేళ.. ఏపీ ప్రజల్లో తీవ్ర ఆగ్రహాం వ్యక్తమవుతోంది. అధికార వైసీపీ మొదలు విపక్షాల వరకు అన్ని పార్టీలు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు చేయటానికి ససేమిరా అంటున్నారు. అదే సమయంలో.. కేంద్రం అమ్మాల్సిందేనని తేల్చి చెబుతుంది. ఇలాంటివేళ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ఆసక్తికర ఆఫర్ ను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టారు.

దీనికి సంబంధించిన సమాచారాన్ని తాజాగా కిషన్ రెడ్డి మీడియాతో పంచుకున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తీసుకోవటానికి ఏపీ ప్రభుత్వం ముందుకు వస్తే.. కేంద్ర మంత్రివర్గం తప్పనిసరిగా పరిశీలిస్తుందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం చాలా కాలంగా నష్టాల్లో నడుస్తోందని.. ప్రజలు పన్ను రూపంలో కట్టిన డబ్బును తీసుకెళ్లి ఎన్ని రోజులని నష్టాలు వచ్చే కంపెనీలో పెడతామని ప్రశ్నించారు.

విశాఖ ఉక్కును మరింత డెవలప్ చేసేందుకు అవసరమైన విస్తరణకు కేంద్రం సాయం చేస్తుందన్నారు. మరి.. విశాఖ ఉక్కును ఏపీ సర్కారు తీసుకుంటుందా? అన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా మారాయి. ఎందుకంటే.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయటానికి కేంద్రం సిద్ధంగా ఉంది. దీనిపై ఏపీ సర్కారు తీవ్ర అభ్యంతరాన్ని చెబుతోంది. ఇలాంటి వేళ.. కిషన్ రెడ్డి నోటి నుంచి ఏపీ సర్కారు తీసుకుంటే పరిశీలిస్తామన్న మాట వచ్చిందంటే.. బీజేపీ అధినాయకత్వం కొత్త గేమ్ ప్లాన్ ను సిద్ధం చేసినట్లుగా కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది. మరి.. కిషన్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ కు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా రియాక్టు అవుతారన్నది అసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.