Begin typing your search above and press return to search.

హైద‌రాబాదు పేరు ఎందుకు మార‌లేదు?

By:  Tupaki Desk   |   15 Oct 2016 9:56 AM GMT
హైద‌రాబాదు పేరు ఎందుకు మార‌లేదు?
X
దేశంలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాలు త‌మ పేర్ల‌ను మార్చేసుకున్నాయి. ఆయా న‌గ‌రాల్లోని ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కే అక్క‌డి ప్రభుత్వాలు న‌గ‌రాల పేర్ల‌ను మార్చేశాయి. ఇలా పేర్లు మారిన న‌గ‌రాల జాబితా చాలానే ఉంది. బొంబాయి పేరు ముంబైగా మార‌గా - క‌ల‌క‌త్తా పేరు కోల్‌ క‌త్తా గా - మ‌ద్రాస్ పేరు చెన్నైగా - బెంగుళూరు పేరు బెంగ‌ళూరుగా - బెనార‌స్ పేరు వార‌ణాసిగా మారిపోయాయి. మ‌రి హైద‌రాబాదు పేరును కూడా భాగ్య‌న‌గ‌రిగా మార్చాల‌ని చాలా కాలం నుంచి డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ప్ర‌ధానంగా బీజేపీ ఈ డిమాండ్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి ఏపీ రెండుగా విడిపోయిన త‌ర్వాత తెలంగాణ రాష్ట్ర రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాదు పేరును భాగ్య‌న‌గ‌రిగా మార్చాల‌ని బీజేపీ తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తోంది. ప‌ది జిల్లాలున్న తెలంగాణ‌ను 31 జిల్లాలున్న పెద్ద రాష్ట్రంగా మారుస్తున్న కేసీఆర్ స‌ర్కారు... హైద‌రాబాదు పేరును భాగ్య‌న‌గ‌రిగా మార్చేస్తుంద‌ని బీజేపీ నేత జి.కిష‌న్ రెడ్డి భావించార‌ట‌.

అయితే కొత్త జిల్లాల ప్ర‌క‌ట‌న పూర్తి అయ్యింది. శంషాబాదు జిల్లాకు రంగారెడ్డి పేరు - గ‌ద్వాల జిల్లాకు జోగులాంబ పేరు - భూపాల‌ప‌ల్లి జిల్లాకు జ‌య‌శంక‌ర్ పేరు - ఆసిఫాబాదు జిల్లాకు కొమురం భీం పేరు పెట్టిన కేసీఆర్ స‌ర్కారు... హైద‌రాబాదు జిల్లా పేరును మాత్రం మార్చలేదు. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కిష‌న్ రెడ్డి... హైద‌రాబాదు పేరును కేసీఆర్ మార్చ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను వివ‌రిస్తూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ముస్లిం మైనారిటీ వ‌ర్గాల్లో మంచి ప‌ట్టున్న మ‌జ్లిస్ పార్టీ ముందు మోక‌రిల్లిన కార‌ణంగానే కేసీఆర్ హైద‌రాబాదు జిల్లా పేరును భాగ్య‌న‌గ‌రిగా మార్చ‌లేక‌పోయారని చెప్పుకొచ్చారు. ఇక అప్ప‌టికే వికారాబాదు జిల్లా పేరును అనంత‌గిరి జిల్లాగా మార్చాల‌ని దాదాపుగా తీర్మానించిన కేసీఆర్ స‌ర్కారు... మ‌జ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞ‌ప్తి చేసిన మ‌రుక్ష‌ణ‌మే త‌న నిర్ణ‌యాన్ని వాప‌స్ తీసుకుంద‌ని, వికారాబాదు జిల్లాకు అదే పేరును కొన‌సాగించేందుకు త‌లూపింద‌ని ఆయ‌న ఆరోపించారు. ఇవ‌న్నీ చూస్తుంటే... మ‌జ్లిస్ పార్టీతో టీఆర్ ఎస్ పార్టీ మంచి దోస్తానానే కొన‌సాగిస్తోంద‌ని కిష‌న్ రెడ్డి ఆరోపించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/