Begin typing your search above and press return to search.

ఆ ఛాన్సే లేద‌న్న కిష‌న్ రెడ్డి - ఇప్పుడెవ‌రికీ ఆస‌క్తి లేదులే!

By:  Tupaki Desk   |   28 Feb 2020 2:30 PM GMT
ఆ ఛాన్సే లేద‌న్న కిష‌న్ రెడ్డి - ఇప్పుడెవ‌రికీ ఆస‌క్తి లేదులే!
X
ఏపీ - తెలంగాణ‌ల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు ముచ్చ‌ట లేద‌ని ప్ర‌క‌టించారు కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి. ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న జ‌రిగిన‌ప్ప‌టి నుంచి కూడా ఈ అంశంపై చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్యేకించి గ‌త ఐదేళ్ల‌లో ఈ అంశం మీద గ‌ట్టి చ‌ర్చ జ‌రిగింది. అప్పుడు సీట్ల పెంపు ప‌ట్ల చంద్ర‌బాబు నాయుడు చాలా ఉబ‌లాట‌ప‌డ్డారు. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాల‌ని ప‌లు సార్లు ఆయ‌న మోడీని కోరిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. అప్ప‌ట్లో చంద్ర‌బాబు నాయుడుకు ఆ ఆస‌క్తి ఉండ‌టానికి కొన్ని కార‌ణాలున్నాయి. అప్ప‌టికే 23 మంది ఎమ్మెల్యేల‌ను ఆయ‌న కొనేశారు. అదే స‌మ‌యంలో ఏపీలో అసెంబ్లీ సీట్ల పున‌ర్విభ‌జ‌న జ‌రిగి - ఎమ్మెల్యే సీట్ల సంఖ్య పెరిగితే జ‌గ‌న్ ను మ‌రింతగా ఇబ్బంది పెట్ట‌వ‌చ్చ‌ని చంద్ర‌బాబు లెక్క‌లేశారు. దీంతో త‌ర‌చూ ఢిల్లీలో సీట్ల సంఖ్య ప్ర‌స్తావ‌న తీసుకు వ‌చ్చేవారు!

అయితే వివిధ స‌మ‌యాల్లో అందుకు కేంద్రం నో చెబుతూ వ‌చ్చింది. ఏపీ, తెలంగాణ‌ల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య‌ను పెంచే ఆలోచ‌న లేద‌ని అప్ప‌ట్లోనే కేంద్రం స్ప‌ష్టం చేసింది. ఒక ద‌శ‌లో కేసీఆర్ ఆ విష‌యాన్ని పూర్తిగా వ‌దిలేశారు. కానీ ఏపీ నుంచి మాత్రం ప్ర‌శ్న‌లు వ‌చ్చేవి పార్ల‌మెంట్ లో. ఇక ఉన్న సీట్ల‌కే సార్వ‌త్రిక ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ చిత్తు అయ్యింది - వైసీపీ బ్ర‌హ్మాండ‌మైన మెజారిటీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఈ క్ర‌మంలో ప్ర‌త్యేకంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య‌ను పెంచ‌మంటూ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీని కోర‌డం లేదు. అది విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న హామీనే అయినా జ‌గ‌న్ దృష్టి ఆ అంశం మీద పెద్ద‌గా లేదు. వేరే అంశాల మీదే జ‌గ‌న్ ఎక్కువ‌గా దృష్టి పెట్టిన వైనం అగుపిస్తూ ఉంది.

ఇలాంటి స‌మ‌యంలో కిష‌న్ రెడ్డి స్పందించారు. ఏపీ, -తెలంగాణ‌ల్లో అసెంబ్లీ సీట్ల పున‌ర్విభ‌జ‌న అంశం కేంద్రం ప‌రిశీల‌న‌లో లేద‌ని తేల్చారు. విభ‌జ‌న చ‌ట్టంలో ఇష్టానుసార‌మైన అంశాల‌ను పేర్కొన్నార‌ని, వాటిని అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ట్టుగా ఆయ‌న మాట్లాడారు. అయినా అటు ఏపీలోనూ - ఇటు తెలంగాణ‌లోనూ పాల‌క ప‌క్షాల‌కు సీట్ల పెంపుపై ఏ మాత్రం ఆస‌క్తి క‌నిపించ‌డం లేదు. ప్ర‌తిప‌క్షాలు ఎలాగూ ఆ విష‌యాన్నే ఎత్త‌డం లేదిప్పుడు. కాబ‌ట్టి కేంద్రం కూడా ఈ అంశాన్ని పూర్తిగా లైట్ తీసుకోవ‌చ్చేమో!