Begin typing your search above and press return to search.

ఏంది కిషన్ రెడ్డి అమిత్ షా.. అభినవ సర్దార్ పటేలా? కొడుక్కి అందుకేనా ఆ పదవి?

By:  Tupaki Desk   |   17 Sep 2022 7:30 AM GMT
ఏంది కిషన్ రెడ్డి అమిత్ షా.. అభినవ సర్దార్ పటేలా? కొడుక్కి అందుకేనా ఆ పదవి?
X
పోలికలు ఒక స్థాయి వరకు ఓకే. హద్దులు మీరిన పోలికలు ప్రజల్లో ఉండే విలువను కోల్పోయేలా చేస్తాయి. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు అదే రీతిలో ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఓడిపోయి.. అనూహ్యంగా ఎంపీగా విజయం సాధించిన కిషన్ రెడ్డికి వరుస పెట్టి ప్రమోషన్లు రావటం.. కేంద్రమంత్రి కావటం తెలిసిందే. అంత మాత్రానికే అమిత్ షాను అభినవ సర్దార్ పటేల్ గా అభివర్ణించటం ఆయన మీద ఉన్న గౌరవాన్ని తగ్గేలా చేస్తుందన్న విమర్శ పలువురి నోట వినిపిస్తోంది.

నిజాం నుంచి స్వేచ్ఛా వాయువుల్నిపీల్చేలా చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ లో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని.. మళ్లీ 74 ఏళ్ల తర్వాత మళ్లీ అమిత్ షా వచ్చి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారన్న ఆయన.. అమిత్ షాను అభినవ సర్దార్ పటేల్ గా అభివర్ణించారు. బీజేపీ పోరాటంతోనే విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలకు ఇవాళ పండుగ రోజు అంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని రోజుల పాటు ఎందుకు నిర్వహించలేదని కేసీఆర్ ను ప్రశ్నించారు. ఈ మాటల్లో అంతో ఇంతో పాయింట్.. లాజిక్ ఉందనుకోవచ్చు. కానీ.. అమిత్ షాను పటేల్ లాంటి మహానుభావుడితో పోల్చటమా? అన్నది ప్రశ్న.

పటేల్ తన కుటుంబ సభ్యులు ఎవరికి పదవులు ఇప్పించుకున్నది లేదు. తాజాగా వస్తున్న వార్తల్ని చూస్తే.. ఇటీవల బైలాస్ మార్చిన బీసీసీఐకు అమిత్ షా కుమారుడు జైషాను అధ్యక్షుడ్ని చేయటం.. ఇప్పుడు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న గంగూలీని ఐసీసీ ఛైర్మన్ గా నియమిస్తున్న సంగతి తెలిసిందే.

సర్దార్ పటేల్ కు దేశం.. దేశ సమైక్యతే లక్ష్యంగా పని చేశారు. నిజాయితీ అన్నది ఆయన రక్తంలోనే ఉంటుంది. అలాంటి పటేల్ ను అమిత్ షాతో పోల్చటం ద్వారా కిషన్ రెడ్డి తన మీద ఉన్న గౌరవాన్ని తగ్గించుకున్నారని చెప్పాలి. అమిత్ షా మనసు దోచుకోవటానికి ప్రయత్నించిన కిషన్ రెడ్డి.. సర్దార్ పటేల్ పోలికతో ప్రజల్లో తనకున్న ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంటారన్న విషయాన్ని మిస్ అయ్యారేంటి చెప్మా?

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.